వెల్‌డ‌న్ అర్జున్‌.. ఆ రెండింటినీ గెలిచావు.. నిన్ను చూస్తే గ‌ర్వంగా ఉంది: కుమారుడిపై సచిన్ భావోద్వేగ పోస్ట్

Arjun Tendulkar Makes IPL Debut Sachin Tendulkar Shares Emotional Message
  • లక్నో తరఫున ఐపీఎల్ 2026లో అరంగేట్రం చేసిన అర్జున్ టెండూల్కర్
  • కుమారుడి ప్రదర్శనపై సోషల్ మీడియాలో సచిన్ ఎమోష‌న‌ల్‌ పోస్ట్
  • ఓపికగా ఎదురుచూసి, కష్టపడ్డావంటూ అర్జున్‌ను ప్రశంసించిన మాస్టర్ బ్లాస్టర్
  • పంజాబ్ పై బౌలింగ్‌లో ఆకట్టుకున్న అర్జున్.. ఒక కీలక వికెట్ తీసిన వైనం
  • ముంబై నుంచి ట్రేడింగ్ ద్వారా ఈ సీజన్‌లో లక్నోకు వచ్చిన అర్జున్
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తన కుమారుడు అర్జున్ టెండూల్కర్ ఐపీఎల్ అరంగేట్రంపై సోషల్ మీడియాలో భావోద్వేగ పోస్ట్ చేశాడు. ఐపీఎల్ 2026 సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్‌జీ) తరఫున అర్జున్ నిన్న తన తొలి మ్యాచ్ ఆడాడు. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో లక్నో ఓడిపోయినప్పటికీ, అర్జున్ తన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఈ నేపథ్యంలో సచిన్ తన కుమారుడిని ప్రశంసిస్తూ చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది.

లక్నో జట్టు ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించడంతో తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో అర్జున్‌కు అవకాశం ఇచ్చింది. ఈ మ్యాచ్‌లో బౌలింగ్‌తో ఆకట్టుకున్న 26 ఏళ్ల అర్జున్, పంజాబ్ ఓపెనర్ ప్రభ్‌సిమ్రాన్ సింగ్‌ను ఒక అద్భుతమైన యార్కర్‌తో ఎల్బీడబ్ల్యూగా వెనక్కి పంపాడు. మొత్తం నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసి 36 పరుగులిచ్చి ఒక వికెట్ పడగొట్టాడు. నిజానికి తన తొలి ఓవర్లోనే ప్రభ్‌సిమ్రాన్ వికెట్ తీసేవాడే కానీ, రిషభ్ పంత్ క్యాచ్ వదిలేయడంతో ఆ అవకాశం చేజారింది. జట్టులోని మిగతా బౌలర్లతో పోలిస్తే 9 ఎకానమీ రేటుతో మెరుగైన ప్రదర్శన కనబరిచాడు. బ్యాటింగ్‌లో ఐదు బంతులు ఎదుర్కొని 5 పరుగులు చేశాడు.

ఈ సీజన్‌లో అర్జున్‌కు ఎక్కువ అవకాశాలు రాకపోయినా, ఓపికగా, సానుకూలంగా ఉన్న తీరుప‌ట్ల‌ తనకు గర్వకారణంగా ఉందని సచిన్ తన పోస్ట్‌లో పేర్కొన్నాడు. "అర్జున్.. చాలా బాగా ఆడావు. ఈ సీజన్ మొత్తం నీ సామర్థ్యాన్ని నమ్ముతూ, ఓపికతో ఉంటూ, నిశ్శబ్దంగా కష్టపడిన తీరు చూసి గర్వపడుతున్నాను. చివరి మ్యాచ్ వరకు అవకాశం కోసం ఎదురుచూసినా నువ్వు సానుకూలంగా ఉన్నావు. క్రికెట్ అనేది నైపుణ్యంతో పాటు ఓపికను కూడా పరీక్షిస్తుంది. ఈ రోజు నువ్వు ఆ రెండింటినీ అద్భుతంగా ప్రదర్శించావు. ఎప్పుడూ ఇలాగే ఉండు. ఆటను ప్రేమించడం కొనసాగించు. లవ్ యూ ఆల్వేస్" అంటూ సచిన్ తన ఎక్స్‌ ఖాతాలో రాసుకొచ్చాడు.

ఐపీఎల్ 2026 సీజన్ అర్జున్‌కు చాలా కీలకం. ముంబై ఇండియన్స్ కాకుండా మరో ఫ్రాంచైజీ తరఫున అతను ఆడుతున్న తొలి సీజన్ ఇదే. ఈ ఏడాది వేలానికి ముందు ముంబై నుంచి ట్రేడింగ్ ద్వారా అర్జున్ లక్నో జట్టుకు మారిన విషయం తెలిసిందే.
Go Back to Shorts
Sachin Tendulkar
Arjun Tendulkar
IPL 2026
Lucknow Super Giants
Punjab Kings
Cricket
Indian Premier League
Prabhsimran Singh

More Telugu News