పాకిస్థాన్, ఉగ్రవాదుల భాష: రాహుల్ గాంధీపై బీజేపీ ఆగ్రహం

Rahul Gandhi Remarks Draw Ire from BJP
  • మోదీ, అమిత్ షా, ఆరెస్సెస్‌పై రాహుల్ గాంధీ విమర్శలు
  • ఆయన వ్యాఖ్యలు ఉగ్రభాషను పోలి ఉందన్న బీజేపీ 
  • ఆయన వ్యాఖ్యల వెనుక పాక్ హస్తం ఉందని ఆరోపణ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, ఆరెస్సెస్ సంస్థ 'దేశద్రోహులు' అని ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలకు చెప్పాలని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ప్రజలకు సూచించడం తీవ్ర దుమారం రేపింది. ఆర్థిక సంక్షోభం వల్ల దేశ ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ప్రధాని మాత్రం ఇటలీలో చాక్లెట్లు పంచుకుంటూ బిజీగా ఉన్నారని రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు. పొదుపు కోసం పిలుపునిచ్చిన ప్రధానియే వాటిని పాటించడం లేదని విమర్శించారు. రాహల్ గాంధీ వ్యాఖ్యలపై బీజేపీ స్పందించింది.

రాహుల్ గాంధీ వాడిన భాష పాకిస్థాన్, ఆ దేశానికి మద్దతిచ్చే ఉగ్రవాదుల భాషను పోలి ఉందని బీజేపీ మండిపడింది. ఆయన వ్యాఖ్యల వెనుక పాక్ హస్తం ఉందని బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా ఆరోపించారు. అక్కడి నేతలు చెప్పినట్లుగానే రాహుల్ గాంధీ మాట్లాడుతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రిని అవమానించడం అతడికి అలవాటుగా మారిందని అన్నారు.

రాహుల్ గాంధీ భాష పాకిస్థాన్ నాయకుల్లా ఉందని కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ అన్నారు. భారతదేశ ఆర్థిక వ్యవస్థ గురించి ప్రపంచానికి తెలుసని, రాహుల్ గాంధీ నుంచి ప్రశంసలు అవసరం లేదని విమర్శించారు. దేశంలో అశాంతిని రగుల్చాలని రాహుల్ గాంధీ కోరుకుంటున్నారని అన్నారు. కానీ మోదీ, అమిత్ షాలకు ప్రజలు అండగా ఉన్నారని అన్నారు. ఈ విషయాన్ని రాహుల్ గాంధీ మరిచిపోకూడదని వ్యాఖ్యానించారు.

రాహుల్ గాంధీ వ్యాఖ్యలు ప్రజాస్వామ్యానికి అవమానమని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారీ అన్నారు. ప్రధానిని అనడం ద్వారా రాహుల్ గాంధీ 140 కోట్ల మంది ప్రజలను దేశద్రోహులుగా పేర్కొన్నట్లే అన్నారు. ఆయన భాష పాకిస్థాన్, ఉగ్రవాదులను పోలి ఉందని విమర్శించారు.

భారత రాజ్యాంగాన్ని కూల్చివేసే పనిని కాంగ్రెస్ చేపట్టిందని సీనియర్ బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ అన్నారు. వాస్తవానికి రాహుల్ గాంధీ ఈ రోజు ఏవైతే మాట్లాడుతున్నారో, నాడు ఎమర్జెన్సీ విధించిన ఇందిరాగాంధీకి వర్తిస్తుందని వ్యాఖ్యానించారు. అవమానకరమైన భాషను ఉపయోగించడం కాంగ్రెస్ ముఖ్య నాయకులకు అలవాటుగా మారిందని విమర్శించారు. ప్రధాని మోదీని దూషించడం, ఆరెస్సెస్‌ను దూషించడం వారికి పరిపాటిగా మారిందని అనురాగ్ ఠాకూర్ మండిపడ్డారు.
Go Back to Shorts
Rahul Gandhi
Narendra Modi
Amit Shah
BJP
RSS
Pakistan
Terrorists
Indian Economy
Congress
India

More Telugu News