మెటాలో ఉద్యోగాల కోత ప్రారంభం.. వర్క్‌ఫ్రమ్ హోం అని చెప్పి వేకువజామునే లేఆఫ్ మెయిల్స్

  • సింగపూర్, అమెరికా, యూకే ప్రాంతాల్లో ఉద్యోగాల కోత
  • ఇంటి నుంచి పని చేయాలని మొదట సూచన
  • పది శాతం ఉద్యోగుల తొలగింపు
ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం మెటాలో ఉద్యోగ తొలగింపులు ప్రారంభమయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉద్యోగులలో పది శాతం మందిని తొలగించనున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇందులో చాలామందికి తొలుత వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పి హఠాత్తుగా లేఆఫ్ మెయిల్స్ పంపించినట్లు తెలుస్తోంది. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

సింగపూర్, అమెరికా, యూకే వంటి ప్రాంతాల్లోని ఉద్యోగులకు మొదట ఇంటి నుంచి పని చేయాలని కంపెనీ సూచించింది. అందుకు వారు సిద్ధమవుతుండగా, వేకువజామున వారికి లేఆఫ్ మెయిల్స్ పంపించింది. అయితే ఎలాంటి గందరగోళం జరగకుండా ఉండేందుకు సంస్థ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తొలగింపుకు గురవుతున్న వారిలో ఎక్కువమంది ఇంజినీరింగ్, ప్రోడక్ట్ బృందాలు ఉన్నాయి.

మెటా తన సింగపూర్‌లోని టీమ్‌కు మొదట మెయిల్స్ పంపించింది. వారికి వేకువజామునే ఈ మెయిల్స్ అందాయి. ఈ తొలగింపుకు ముందు ప్రపంచవ్యాప్తంగా మెటాలో దాదాపు 78 వేల మంది ఉద్యోగులు ఉన్నారు. తాజాగా పది శాతం ఉద్యోగులకు లేఆఫ్ మెయిల్స్ వచ్చాయంటే సుమారు 8 వేల మందిని తొలగించనుంది.

Meta layoffs
Mark Zuckerberg
Meta jobs cuts
Layoff emails
Work from home
Singapore Meta team

More Telugu News