లాభాల బాటలో వియాష్ సైంటిఫిక్.. రూ.16 కోట్ల నుంచి రూ.225 కోట్లకు

Viash Scientific Reports Strong Profits Growth
  • గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.32 కోట్ల నష్టం
  • గత ఆర్థిక సంవత్సరంలో 14 రెట్లు పెరిగిన లాభం
  • కంపెనీ చరిత్రలోనే మెరుగైన ఫలితాలు
  • 100కు పైగా దేశాలకు సేవలు
ఫార్ములేషన్స్, ఏపీఐ రంగంలోని ప్రముఖ ఫార్మా కంపెనీ వియాష్ సైంటిఫిక్ మార్చి త్రైమాసికంలో రూ.66 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గతేడాది ఇదే కాలంలో కంపెనీ రూ.32 కోట్ల నికర నష్టం నమోదు చేసింది. మెరుగైన మార్జిన్ల కారణంగా ఈసారి లాభాలు పెరిగాయి. ఈ త్రైమాసికంలో కంపెనీ ఆదాయం 19 శాతం పెరిగి రూ.920 కోట్లకు చేరుకుంది. అలాగే EBITDA 64 శాతం పెరిగి రూ.200 కోట్లుగా నమోదైంది.  

14 రెట్లు పెరిగిన లాభం
ఆర్థిక సంవత్సరం 2026 (FY26) మొత్తానికి కంపెనీ నికర లాభం 14 రెట్లు పెరిగింది. గత ఏడాది కేవలం రూ.16 కోట్లుగా ఉన్న లాభం ఈ ఏడాది ఏకంగా రూ.225 కోట్లకు చేరింది. కంపెనీ మొత్తం ఆదాయం 14 శాతం పెరిగి రూ.3,420 కోట్లుగా నమోదైంది. కంపెనీ EBITDA కూడా 60 శాతం పెరిగి రూ.702 కోట్లకు చేరుకుంది.

చరిత్రలోనే బలమైన త్రైమాసికం
కంపెనీ చరిత్రలోనే మార్చి త్రైమాసికంలో మెరుగైన ఫలితాలు వచ్చాయని మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ హరిబాబు బోడెపూడి తెలిపారు. ‘‘వ్యాపారాల విలీనం మాకు కలిసొచ్చింది. దాని ఫలితాలే ఇప్పుడు ఆర్థికంగా కనిపిస్తున్నాయి. మా అంతర్గత వ్యవస్థలు బలోపేతం కావడం వల్ల అనుకున్న పనులు వేగంగా జరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా వస్తున్న రాజకీయ, సముద్ర రవాణా ఇబ్బందులను సమర్థవంతంగా తట్టుకోగలుగుతున్నాం. వనరులను సరిగ్గా వాడుకుంటూ, ఖర్చులు తగ్గించుకుంటూ, మార్కెట్ పరిస్థితులకు తగ్గట్లు ధరలను మారుస్తూ ఈ సవాళ్లను అధిగమిస్తున్నాం. కొత్త ఆర్థిక సంవత్సరంలో మా కొత్త ప్రొడక్టులు, భవిష్యత్తు ప్రణాళికలు మమ్మల్ని మరింత ఉత్సాహపరుస్తున్నాయి. ప్రస్తుతం మా కంపెనీ అప్పులు చాలా వరకు తగ్గిపోయాయి. బ్యాలెన్స్ షీట్ పటిష్ఠంగా ఉంది. అందుకే మా వ్యాపారాన్ని మరింత విస్తరించడానికి, దీర్ఘకాలంలో మంచి లాభాలు రాబట్టడానికి వీలుగా.. కొన్ని ఇతర సంస్థలను కొనుగోలు చేసే అవకాశాలను కూడా పరిశీలిస్తున్నాం’’ అని హరిబాబు వివరించారు.

ప్రపంచవ్యాప్త గుర్తింపు
వియాష్ సైంటిఫిక్ ప్రపంచవ్యాప్త అగ్రశ్రేణి 25 యానిమల్ హెల్త్ కంపెనీల్లో ఒకటి. దీంట్లో 3,000 మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. మానవ, పశు వైద్యానికి సంబంధించిన మందులను తయారు చేస్తూ 100 కంటే ఎక్కువ దేశాలకు సేవలందిస్తోంది. భారత్, స్పెయిన్, బ్రెజిల్, టర్కీ, అమెరికా దేశాల్లో దీనికి తయారీ, ఆర్‌అండ్‌డీ కేంద్రాలున్నాయి. వీటికి యుఎస్ఎఫ్‌డీఏ, డబ్ల్యూహెచ్‌ఓ లాంటి సంస్థల ఆమోదం ఉంది. ఈ అద్భుత ఫలితాల నేపథ్యంలో మంగళవారం కంపెనీ షేరు ధర ఒక శాతం పెరిగి రూ.229 వద్ద ముగిసింది.

Go Back to Shorts
Viash Scientific
Viash Scientific profits
Haribabu Bodepudi
pharma company
API
formulations
financial results
animal health
pharmaceuticals
stock price

More Telugu News