భారత పర్యటనకు రష్యా అధ్యక్షుడు పుతిన్‌.. పూర్తి వివరాలివే

  • సెప్టెంబర్‌లో రానున్న రష్యా అధ్యక్షుడు
  • ధృవీకరించిన రష్యా అధ్యక్ష భవనం
  • బ్రిక్స్‌ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనున్న పుతిన్‌
  • ఏడాది వ్యవధిలో రెండోసారి భారత్‌కు
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఈ ఏడాది సెప్టెంబర్ 12, 13 తేదీల్లో భారత్ లో పర్యటించనున్నారు. భారత్ ఆతిథ్యమిస్తున్న 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు ఆయన ఢిల్లీ రానున్నట్లు ఆ దేశ అధ్యక్ష భవనం ‘క్రెమ్లిన్’ మంగళవారం అధికారికంగా ధృవీకరించింది.  

భారత్, రష్యా మధ్య వ్యూహాత్మక, రక్షణ రంగ బంధం బలపడుతున్న తరుణంలో పుతిన్ పర్యటన ఖరారు కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. గత డిసెంబర్‌లో జరిగిన 23వ భారత్-రష్యా వార్షిక సదస్సు కోసం పుతిన్ ఢిల్లీకి వచ్చారు. ఆ సమయంలో మోదీతో కలిసి ద్వైపాక్షిక సంబంధాల విస్తరణపై చర్చలు జరిపారు. ఆ పర్యటన జరిగిన ఏడాదిలోపే పుతిన్ రెండోసారి భారత్‌కు వస్తుండటం గమనార్హం.

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం 2022లో ప్రారంభమైన తర్వాత పుతిన్ గతేడాది డిసెంబర్‌లోనే మొదటిసారి భారత్‌లో అడుగుపెట్టారు. దానికి ముందు ఆయన 2021లో ఢిల్లీని సందర్శించారు. భారత్-రష్యా మధ్య ఏటా ఒకసారి ఇరు దేశాల అధినేతలు భేటీ అయ్యే సంప్రదాయం ఉంది. ఒక ఏడాది భారత్‌లో జరిగితే, మరో ఏడాది రష్యాలో ఈ వార్షిక సదస్సు జరుగుతుంది. 

భారత్ నేతృత్వంలో ఢిల్లీలో జరగబోయే ఈ ప్రతిష్ఠాత్మక బ్రిక్స్ సదస్సులో.. ప్రపంచ భద్రతా సవాళ్లు, ఆర్థిక సహకారం బలోపేతం చేయడం వంటి కీలక అంశాలపై సభ్య దేశాల అధినేతలు చర్చించనున్నారు.

Vladimir Putin
Putin India visit
Russia India relations
BRICS summit 2024
India Russia defense
Russia Ukraine war
Delhi
Bilateral talks
Strategic partnership
Geopolitics

More Telugu News