రాబోయే రోజుల్లో కావలి 'కనకపట్నం'గా పాత పేరు సార్ధకం అవుతుంది: సీఎం చంద్రబాబు

Chandrababu Naidu Kavali to Reclaim Old Name Kanaka Patnam
  • కావలి నియోజకవర్గం తుమ్మలపెంటలో చంద్రబాబు సభ
  • మత్స్యకార సేవలో భాగంగా 1.30 లక్షల కుటుంబాల ఖాతాల్లోకి రూ.262 కోట్లు జమ
  • వేట నిషేధ భృతిని రూ.10 వేల నుంచి రూ.20 వేలకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం
  • తీరం మనదే, వేట మనదేనని.. ఇతర రాష్ట్రాల మత్స్యకారులను అనుమతించేది లేదని స్పష్టీకరణ
  • కావలికి పలు అభివృద్ధి పనుల మంజూరు
  • వేదికపైనే అధికారుల పనితీరును సమీక్షించిన సీఎం
రాష్ట్రంలోని మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపడమే తన ప్రభుత్వ లక్ష్యమని, వారి ఆర్థికాభివృద్ధే ధ్యేయమని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలోని తుమ్మలపెంటలో మంగళవారం జరిగిన 'మత్స్యకార సేవలో' కార్యక్రమంలో ఆయన పాల్గొని సుదీర్ఘ ప్రసంగం చేశారు. వేట నిషేధ సమయంలో మత్స్యకార కుటుంబాలకు అండగా నిలిచేందుకు 1,30,796 కుటుంబాలకు రూ. 20,000 చొప్పున మొత్తం రూ. 262 కోట్లను వారి బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా జమ చేస్తున్నట్లు ప్రకటించారు. ఇచ్చిన మాట ప్రకారం గత ప్రభుత్వమిచ్చిన రూ.10 వేల భృతిని రూ.20 వేలకు పెంచామని గుర్తుచేశారు.

ఒకప్పుడు వాణిజ్య వైభవంతో తులతూగి ‘కనకపట్నం’గా పేరుగాంచిన కావలి, మళ్ళీ తన పూర్వపు కీర్తిని సంతరించుకోబోతోందని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ఉద్ఘాటించారు. అభివృద్ధి పథంలో శరవేగంగా దూసుకెళ్లి, ఆ పేరును సార్ధకం చేసుకోబోతోందని అన్నారు. ఇది కేవలం ఆశాభావం కాదని, తాము ఇస్తున్న స్పష్టమైన హామీ అని తెలిపారు. 

కనకపట్నం’ కావలికి వరాల జల్లు

స్థానిక ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి విజ్ఞప్తి మేరకు, కావలి నియోజకవర్గ అభివృద్ధికి ముఖ్యమంత్రి వరాల జల్లు కురిపించారు. ఈ ప్రకటనలతో కావలి భవిష్యత్ చిత్రం కళ్ళకు కట్టినట్టయింది.
25 మత్స్యకార గ్రామాలను అనుసంధానించేందుకు రూ. 6.27 కోట్లతో మెటల్ రోడ్ల నిర్మాణం.
రైతులు, మత్స్యకారులకు జీవనాధారమైన బకింగ్‌హామ్ కాలువ పూడికతీత పనులకు రూ. 6.9 కోట్లు.
ప్రాంతంలో దీర్ఘకాలిక విద్యుత్ సమస్యల పరిష్కారానికి అత్యంత కీలకమైన 220/133/33 కేవీ సబ్‌స్టేషన్‌కు తక్షణ ఆమోదం.

ఈ పనుల విలువ రూ. 13 కోట్లకు పైగా ఉండటంతో, రాబోయే రోజుల్లో కావలి రూపురేఖలు మారనున్నాయని స్పష్టమైంది. దీనికి తోడు రామాయపట్నం పోర్టు, దగదర్తి విమానాశ్రయం, సమీప ఇండస్ట్రియల్ కారిడార్లతో ఈ ప్రాంతం అభివృద్ధికి మకుటాయమానంగా నిలుస్తుందని, కావలి నిజమైన 'కనకపట్నం'గా విలసిల్లుతుందని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు.

అలలపై బతుకులకు... రూ. 20 వేల అండ

ప్రాణాలను పణంగా పెట్టి, సముద్రపు అలలతో నిత్యం పోరాడే మత్స్యకార సోదరుల కష్టాలు తనకు తెలుసంటూ ప్రసంగం ప్రారంభించిన ముఖ్యమంత్రి, వారి కుటుంబాలకు అండగా నిలవడమే తన ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని ఉద్ఘాటించారు. ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం, వేట నిషేధ భృతిని రూ.10,000 నుంచి ఏకంగా రూ.20,000కు పెంచుతున్నట్లు ప్రకటించి, సభా ప్రాంగణంలో హర్షాతిరేకాలు నింపారు. 

ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 1,30,796 మత్స్యకార కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని, ఇందుకోసం రూ. 262 కోట్లను బటన్ నొక్కి వారి ఖాతాల్లోకి నేరుగా జమ చేస్తున్నట్లు తెలిపారు. "మీరు ధైర్యంగా వేటకు వెళ్ళండి. మీ కుటుంబాలను ఆదుకునే బాధ్యత నాది. మీ కష్టాన్ని గుర్తించి, గౌరవించే ప్రభుత్వం ఇది" అని చంద్రబాబు భరోసా ఇచ్చారు.

‘తీరం మనదే.. వేట మనదే’.. పొరుగువారికి సింహగర్జన

మత్స్యకారుల హక్కుల పరిరక్షణ విషయంలో తన ప్రభుత్వం ఎంత కఠినంగా వ్యవహరిస్తుందో ముఖ్యమంత్రి తన మాటల్లో స్పష్టం చేశారు. "తీరం మనదే, బోటు మనదే, వేట మనదే. ఈ విషయంలో ఎలాంటి రాజీకి తావులేదు. మన సముద్ర జలాల్లోకి పొరుగు రాష్ట్రాల బోట్లు అక్రమంగా ప్రవేశిస్తే ఉపేక్షించేది లేదు. వారిని వెంటాడతాం, వేటాడతాం. మన మత్స్యకారుల సంపదను దోచుకోవడానికి ప్రయత్నిస్తే కఠిన చర్యలు తప్పవు" అంటూ తీవ్ర స్వరంతో హెచ్చరించారు. 

తీరప్రాంతంలో నిఘాను పటిష్ఠం చేస్తామని, పెట్రోలింగ్ బోట్ల సంఖ్యను పెంచుతామని హామీ ఇచ్చారు. అంతేకాకుండా, మత్స్యకారుల చిరకాల వాంఛను నెరవేరుస్తూ, 60 శాతం సబ్సిడీతో 200 అత్యాధునిక మెకనైజ్డ్ బోట్లను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించడంతో మత్స్యకారులు ఆనందంతో కేరింతలు కొట్టారు.

సముద్రపు నాచుతో మహిళల జీవితాల్లో మార్పు

కేవలం తక్షణ సాయంతోనే సరిపెట్టకుండా, మత్స్యకారులను ఆర్థికంగా ఉన్నత స్థానంలో నిలబెట్టడమే తన లక్ష్యమని చంద్రబాబు అన్నారు. "సముద్ర గర్భంలో అపార సంపద దాగి ఉంది. దానిని మీ అభివృద్ధికి సోపానంగా మారుస్తాను. మగవారు వేటకు వెళ్తే, మన ఆడబిడ్డలు తీరంలోనే ఉంటూ అదనపు ఆదాయం సంపాదించే మార్గం చూపిస్తాను" అంటూ సముద్రపు నాచు (సీవీడ్) సాగు ప్రాజెక్టును ఆవిష్కరించారు. 

"ఈ సీవీడ్‌కు అంతర్జాతీయంగా భారీ డిమాండ్ ఉంది. మన డ్వాక్రా మహిళలకు ఆధునిక సాంకేతికత అందించి, దీని సాగులో శిక్షణ ఇప్పించి, వారిని పారిశ్రామికవేత్తలుగా మారుస్తాను. మీ ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ కల్పించే బాధ్యత నాది. నేను మీకు ముఖ్యమంత్రినే కాదు, ఒక ‘మార్కెట్ మేనేజర్‌’గా కూడా పనిచేస్తాను" అని హామీ ఇచ్చారు.

వేదికపైనే అధికారులకు క్లాస్.. పాలనలో పరుగు

తన పాలనలో పారదర్శకతకు, జవాబుదారీతనానికి పెద్దపీట వేస్తానని చెప్పడమే కాదు, చంద్రబాబు దానిని వేదికపైనే ఆచరించి చూపారు. నెల్లూరు జిల్లాలో వివిధ శాఖల పనితీరుపై ప్రజల సంతృప్తి శాతాన్ని విశ్లేషిస్తూ, అధికారులకు అక్కడికక్కడే దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలోనే అత్యధిక సంతృప్తి శాతం సాధించిన జిల్లా కలెక్టర్‌తో పాటు ఇరిగేషన్, రెవెన్యూ శాఖల అధికారులను పేరుపేరునా అభినందించారు. అదే సమయంలో, ఆర్టీసీ, దేవదాయ, గ్రామీణ నీటి సరఫరా వంటి శాఖల్లో పనితీరు మెరుగుపరుచుకోవాలని సున్నితంగా సూచించారు. "ప్రజాసేవలో అలసత్వం వద్దు. ప్రజల సంతృప్తే మనకు కొలమానం కావాలి" అని హితవు పలికారు.

Go Back to Shorts
Chandrababu Naidu
Andhra Pradesh
Fishermen
Kavali
Kanaka Patnam
Nellore District
Fishing Ban
AP Government
Seaweed Farming
Fisheries Development

More Telugu News