తీవ్రమైన ఎండలతో శ్వాస సమస్యలు.. డాక్టర్ల రక్షణ చిట్కాలు ఇవే!

Breathing Problems due to Heat Wave Doctors Tips
  • ఆస్తమా ఉన్నవారికి మరింత ఇబ్బంది
  • అలర్జీలు పెరిగే అవకాశం
  • శ్వాస నాళాల్లో వాపు పెరిగి దగ్గు
  • కాలుష్యాన్ని బంధించే తేమ
  • డీహైడ్రేషన్‌ కాకుండా చూసుకోవాలి
వేసవిలో ఎండలు, ఉక్కపోత కేవలం చర్మంపైనే కాకుండా ఊపిరితిత్తుల ఆరోగ్యంపై కూడా తీవ్ర ప్రభావం చూపుతాయి. ముఖ్యంగా ఆస్తమా, దీర్ఘకాల శ్వాసకోశ సమస్యలు, అలర్జీలు ఉన్నవారికి ఎండ తీవ్రత, గాలిలో పెరిగే తేమ, కాలుష్యం కారణంగా శ్వాస తీసుకోవడం చాలా కష్టంగా మారుతుంది. ఈ నేపథ్యంలో ఎండల నుంచి ఊపిరితిత్తులను ఎలా కాపాడుకోవాలో వైద్య నిపుణులు చెబుతున్న కొన్ని చిట్కాలు చూద్దాం..

సమస్యలు ఎందుకు పెరుగుతాయి?
అధిక ఉష్ణోగ్రతల వల్ల శరీరాన్ని చల్లబరచడానికి గుండె వేగంగా కొట్టుకుంటుంది. శ్వాస తీసుకునే వేగమూ పెరుగుతుంది. దీంతో సాధారణ వ్యక్తుల కంటే ఆస్తమా, శ్వాస సమస్యలు ఉన్నవాళ్లు త్వరగా అలసిపోతారు. అలాగే గాలిలో తేమ ఎక్కువగా ఉన్నప్పుడు చమట త్వరగా ఆరక శరీరం వేడెక్కుతుంది. ఈ తేమ కాలుష్య కారకాలను, అలర్జీలను బంధించి ఉంచడం వల్ల శ్వాసనాళాల్లో వాపొచ్చి దగ్గొస్తుంది. నగరాల్లో ఎండల వల్ల ఓజోన్ వాయువు, పొగమంచు పెరిగి ఆస్తమా అటాక్స్‌కు దారితీస్తాయి.

ఎవరికి ప్రమాదం?
చిన్న పిల్లలు, వృద్ధులు, పొగ తాగేవాళ్లు, గుండె జబ్బులు ఉన్నవారితో పాటు రోజూ ఎండలో పనిచేసే కూలీలు, కాలుష్యం ఎక్కువగా ఉన్న నగరాల్లో నివసించే వారు ఈ వాతావరణం వల్ల త్వరగా అనారోగ్యానికి గురవుతారు.

ప్రమాద సంకేతాలు
శ్వాస ఆడకపోవడం, ఛాతీ పట్టేసినట్లు ఉండటం, మాట్లాడటానికి కూడా ఇబ్బంది పడటం, పెదవులు లేదా చేతి గోళ్లు నీలం రంగులోకి మారడం, విపరీతమైన నీరసం, కళ్లు తిరగడం వంటి లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి.

ఊపిరితిత్తుల రక్షణకు చిట్కాలు:
  • తీవ్రమైన ఎండలో బయటకు వెళ్లొద్దు.
  • గాలి నాణ్యత (AQI) చెక్ చేసి బయట తిరగాలి.
  • ఇంట్లో చల్లగా ఉండేలా చూసుకోవాలి.
  • డీహైడ్రేషన్ కాకుండా చూసుకోవాలి.
  • భారీ వ్యాయామాలు వద్దు.
  • మందులు క్రమంగా వాడాలి.
  • వదులుగా ఉండే దుస్తులు ధరించాలి.
Go Back to Shorts
Breathing Problems
Summer heat
asthma
lung health
heat wave
air quality
dehydration
respiratory issues
heatstroke
AQI

More Telugu News