ముంబై ఇండియన్స్‌కి మహేల జయవర్ధనే గుడ్‌బై!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ముంబై ఇండియన్స్‌కి మహేల జయవర్ధనే గుడ్‌బై!

Mahela Jayawardene steps down as Mumbai Indians Head Coach in a major shock
  • పరస్పర అంగీకారంతో హెడ్‌ కోచ్‌ బాధ్యతల నుంచి వైదొలగిన జయవర్ధనే
  • 2026 సీజన్‌లో ముంబైకి దక్కింది కేవలం నాలుగు విజయాలే
  • కొత్త కోచ్‌ కోసం పలువురు అభ్యర్థుల పేర్లను పరిశీలిస్తున్న ఫ్రాంచైజీ
  • జయవర్ధనే కోచింగ్‌లో మూడు ఐపీఎల్‌ టైటిళ్లు గెలిచిన ముంబై
  • జయవర్ధనే సేవలను ప్రశంసించిన నీతా అంబానీ
ఐపీఎల్‌లో ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ఆ జట్టు హెడ్‌ కోచ్‌ మహేల జయవర్ధనేతో తన అనుబంధాన్ని ముగించుకుంది. ఇరుపక్షాలు పరస్పర అంగీకారంతో విడిపోవాలని నిర్ణయించుకున్నాయి. 2026 సీజన్‌లో జట్టు ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో వచ్చే సీజన్‌కు కొత్త కోచ్‌ను నియమించేందుకు ఫ్రాంచైజీ సిద్ధమవుతోంది.

2026 ఐపీఎల్‌ సీజన్‌ ముంబై ఇండియన్స్‌కు నిరాశనే మిగిల్చింది. ఆ సీజన్‌లో జట్టు కేవలం నాలుగు విజయాలకే పరిమితమైంది. ఆటగాళ్ల గాయాలు, అందుబాటులో లేకపోవడం, డ్రెస్సింగ్‌ రూమ్‌లో విభేదాలు ఉన్నాయన్న వార్తలు జట్టు ప్రదర్శనపై ప్రభావం చూపినట్లు కథనాలు వెలువడ్డాయి. కొత్త హెడ్‌ కోచ్‌ ఎంపిక కోసం ఫ్రాంచైజీ ఇప్పటికే పలువురి పేర్లను పరిశీలిస్తున్నట్లు సమాచారం. వచ్చే వారంలో అభ్యర్థులతో ఇంటర్వ్యూలు నిర్వహించే అవకాశం ఉంది. జయవర్ధనే ముంబై ఇండియన్స్‌లో మరో బాధ్యతలో కొనసాగే అవకాశం లేదని తెలుస్తోంది.

ముంబైతో జయవర్ధనే ప్రయాణం 2017లో ప్రారంభమైంది. ఆయన కోచింగ్‌లో జట్టు 2017, 2019, 2020 సీజన్లలో ఐపీఎల్‌ టైటిళ్లు సాధించింది. ముఖ్యంగా 2019, 2020లో వరుసగా ఛాంపియన్‌గా నిలిచింది. దీంతో ఫ్రాంచైజీ చరిత్రలో అత్యంత విజయవంతమైన కోచ్‌లలో ఒకరిగా జయవర్ధనే గుర్తింపు పొందాడు.

2022 నుంచి 2024 వరకు ముంబై ఇండియన్స్‌ గ్లోబల్‌ హెడ్‌ ఆఫ్‌ పెర్ఫార్మెన్స్‌గా వ్యవహరించిన అతడు.. కోచింగ్‌, ఆటగాళ్ల ఎంపిక, వ్యూహరచన వంటి బాధ్యతలను పర్యవేక్షించాడు. 2024లో తిరిగి హెడ్‌ కోచ్‌గా బాధ్యతలు చేపట్టాడు. 2025లో ముంబై ప్లేఆఫ్స్‌కు చేరినా, 2026లో తొమ్మిదో స్థానానికి పడిపోయింది.

ముంబైతో తన అనుబంధం పదేళ్లకు పైగా కొనసాగిందని జయవర్ధనే పేర్కొన్నాడు. ఆటగాళ్లు, కోచింగ్‌ సిబ్బంది, అభిమానులతో కలిసి ఎన్నో మధుర జ్ఞాపకాలు సృష్టించుకున్నామని తెలిపాడు. తనపై నమ్మకం ఉంచిన నీతా అంబానీ, ఆకాశ్‌ అంబానీలకు కృతజ్ఞతలు చెప్పాడు. ముంబై ఇండియన్స్‌కు ఆయన అందించిన సేవలను నీతా అంబానీ కూడా ప్రశంసించారు. జయవర్ధనే ఎప్పటికీ తమ ‘వన్‌ ఫ్యామిలీ’లో భాగమేనని పేర్కొన్నారు.

కొత్త కోచ్‌ ఎంపిక దిశగా అడుగులు వేస్తున్న ముంబై ఇండియన్స్‌.. వచ్చే ఐపీఎల్‌ సీజన్‌లో మళ్లీ టైటిల్‌ పోటీలో నిలవడమే లక్ష్యంగా ముందుకు సాగనుంది.
Advertisement
Mahela Jayawardene
Mumbai Indians
IPL Head Coach
Indian Premier League
Nita Ambani
Cricket News

More Telugu News