తమిళనాడు సీఎం విజయ్‌ను కలిసిన టీడీపీ ఎంపీ.. ఆసక్తి రేపుతున్న భేటీ

TDP MP Magunta Srinivasulu Reddy Meets CM Vijay in Chennai
  • తమిళనాడు సీఎం విజయ్‌తో టీడీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి భేటీ
  • మర్యాదపూర్వకంగానే విజయ్‌ను కలిశాన‌న్న‌ ఎంపీ మాగుంట
  • ఇటీవల కాంగ్రెస్, ఇతర పార్టీల మద్దతుతో సీఎంగా బాధ్యతలు చేపట్టిన విజయ్
తమిళనాడు ముఖ్యమంత్రి, టీవీకే అధినేత జోసెఫ్ విజయ్‌ను టీడీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కలిశారు. సీఎంగా విజయ్ బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో తన మేనల్లుడు, పారిశ్రామికవేత్త ఎస్. రామిరెడ్డితో కలిసి వెళ్లి మర్యాదపూర్వకంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ భేటీకి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ సందర్భంగా విజయ్‌ను ఆయన శాలువాతో సత్కరించారు. ఈ భేటీకి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యం లేదని, కేవలం మర్యాదపూర్వకంగానే కలిశామని మాగుంట వర్గం స్పష్టం చేసింది. చెన్నై కేంద్రంగా మాగుంటకు వ్యాపారాలు ఉండటం, తమిళ రాజకీయ నేతలతో మంచి సంబంధాలు కొనసాగించడం వల్లే ఈ భేటీ జరిగినట్లు తెలుస్తోంది. కొత్తగా కొలువుదీరిన ప్రభుత్వ అధినేతను కలవడం ద్వారా ఆయన తన పరిచయాలను కొనసాగించారు.

ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే, పూర్తి మెజారిటీ లేకపోవడంతో కాంగ్రెస్, వీసీకే, ఐయూఎంఎల్ వంటి పార్టీల మద్దతుతో ఆయన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పాలనపై విజయ్ తనదైన ముద్ర వేస్తున్నారు.

గవర్నర్ సూచన మేరకు మే 13న జరిగిన బలపరీక్షలో విజయ్ ప్రభుత్వం విజయం సాధించింది. అసెంబ్లీలో జరిగిన ఓటింగ్‌లో విజయ్ సర్కార్‌కు అనుకూలంగా 144 మంది ఎమ్మెల్యేలు ఓటు వేయగా, 22 మంది వ్యతిరేకించారు. డీఎంకే సభ్యులు ఓటింగ్‌కు దూరంగా ఉండగా, అన్నాడీఎంకే రెబల్ ఎమ్మెల్యేలు సైతం ప్రభుత్వానికి మద్దతు పలకడం గమనార్హం.
Go Back to Shorts
TDP MP Magunta
Vijay Joseph
Tamil Nadu CM
Magunta Srinivasulu Reddy
TVK Party
Tamil Nadu Politics
S Rami Reddy
Tamil Nadu Assembly Elections
Political Meeting

More Telugu News