ఎలక్ట్రిక్ బస్సుల ప్రైవేటీకరణ తప్పనిసరి: కొనకళ్ల నారాయణ

Konakalla Narayana says APSRTC privatization is a must
  • ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణకు ప్రైవేట్ ఆపరేటర్లను ఆహ్వానించడం తప్పనిసరి అన్న కొనకళ్ల
  • మహిళల ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఆర్టీసీపై తీవ్ర ప్రభావం పడుతోందని వ్యాఖ్య
  • టికెట్ ఛార్జీలను పెంచబోమని వెల్లడి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC)లో ఎలక్ట్రిక్ బస్సుల ప్రైవేటీకరణ అనేది తప్పనిసరి అని ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణ అభిప్రాయపడ్డారు. సంస్థ ప్రస్తుత ఆర్థిక పరిస్థితి, భవిష్యత్తు అవసరాలను వివరిస్తూ ఆయన పలు కీలక విషయాలను వెల్లడించారు.


రాష్ట్రంలో ప్రస్తుతం 10 వేల ఆర్టీసీ బస్సులు సేవలు అందిస్తున్నాయని, పర్యావరణ పరిరక్షణ కోసం వీటి స్థానంలో 10 వేల ఎలక్ట్రికల్ బస్సులను తీసుకురావాల్సి ఉందని ఛైర్మన్ తెలిపారు. అయితే, ప్రస్తుతం మార్కెట్లో ఒక్కో ఎలక్ట్రికల్ బస్సు ధర దాదాపు రూ. కోటి 60 లక్షలు పలుకుతోందని, మొత్తం 10 వేల బస్సుల కొనుగోలుకు సుమారు రూ. 15,000 కోట్లు ఖర్చవుతుందని వివరించారు. అంతటి భారీ మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టే ఆర్థిక స్తోమత అటు ఆర్టీసీకి గానీ, ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి గానీ ప్రస్తుతానికి లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలను వాడుకుంటూ, ప్రైవేటు ఆపరేటర్లను ఆహ్వానించడం ఒక్కటే ప్రత్యామ్నాయమని పేర్కొన్నారు. ప్రైవేటు ఆపరేటర్లు పెట్టుబడి పెట్టి బస్సులు నడిపించడం వల్ల సంస్థపై అదనపు భారం తప్పుతుందని అభిప్రాయపడ్డారు.


మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించడం వల్ల ఆర్టీసీపై తీవ్ర ఆర్థిక భారం పడిందని కొనకళ్ల నారాయణ స్పష్టం చేశారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో డీజిల్ ధరలు పెరుగుతున్నప్పటికీ ప్రయాణికులపై భారం పడకుండా బస్సు ఛార్జీలను పెంచబోమని తేల్చిచెప్పారు. డీజిల్ బస్సుల నిర్వహణకు కిలోమీటర్‌కు రూ. 19 ఖర్చవుతుండగా, ఎలక్ట్రికల్ బస్సులకు కేవలం రూ. 7 మాత్రమే అవుతుందని గణాంకాలను వివరించారు. ప్రైవేటు భాగస్వామ్యంతో ఎలక్ట్రికల్ బస్సులను రంగంలోకి దించడం వల్ల కాలుష్యం తగ్గడంతో పాటు, సంస్థకు ఖర్చులు కలసివచ్చి ప్రయాణికులకు మరిన్ని మెరుగైన సేవలు అందించడానికి వీలవుతుందని ఆర్టీసీ ఛైర్మన్ వెల్లడించారు.

Go Back to Shorts
Konakalla Narayana
APSRTC
APSRTC privatization
Electric buses
APSRTC chairman
Free bus travel
Andhra Pradesh
Road transport
Bus fares

More Telugu News