మోదీ పొదుపు పిలుపు.. మహానాడును ఆన్‌లైన్ పద్ధతిలో నిర్వహిస్తున్నామన్న కొల్లు రవీంద్ర

TDP Mahanadu to be Held Online Due to Fuel Crisis Says Kollu Ravindra
  • ఇంధన సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకుని టీడీపీ పొదుపు చర్యలు
  • మహానాడు కార్యక్రమం మంగళగిరిలోని టీడీపీ కార్యాలయానికి పరిమితం
  • నియోజకవర్గాల్లో క్లస్టర్ల వారీగా పెద్ద స్క్రీన్లు ఏర్పాటు చేస్తామన్న కొల్లు రవీంద్ర

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పొదుపు పిలుపునకు అనుగుణంగా, తెలుగుదేశం పార్టీ 'మహానాడు' కార్యక్రమాన్ని ఈసారి పూర్తిగా ఆన్‌లైన్ (డిజిటల్) పద్ధతిలో నిర్వహించాలని పార్టీ అధినేత చంద్రబాబు నిర్ణయించారని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు. అంతర్జాతీయంగా నెలకొన్న యుద్ధ ప్రభావం వల్ల దేశవ్యాప్తంగా ఏర్పడిన విపత్కర పరిస్థితులు, ఇంధన సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ పొదుపు చర్యలకు శ్రీకారం చుట్టినట్లు ఆయన స్పష్టం చేశారు.


నెల్లూరు వేదికగా భారీ ఎత్తున జరగాల్సిన మహానాడు కార్యక్రమాన్ని, ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయానికి పరిమితం చేశారు. అక్కడి నుంచే పొలిట్‌బ్యూరో సభ్యులు, ముఖ్య నేతల సమక్షంలో ఆన్‌లైన్ ద్వారా ఈ వేడుకలు జరగనున్నాయి. అయితే కేడర్‌కు ఎటువంటి నిరాశ కలగకుండా, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 175 నియోజకవర్గాల్లో క్లస్టర్ల వారీగా పెద్ద స్క్రీన్లను ఏర్పాటు చేసి డిజిటల్ పద్ధతిలో అందరినీ భాగస్వామ్యం చేయనున్నారు. మహానాడు తీర్మానాలు, పార్టీ భవిష్యత్తు కార్యాచరణను ఈ స్క్రీన్ల ద్వారానే నాయకులకు, కార్యకర్తలకు చేరవేస్తారు.


ఇదే సమయంలో ఇంధన కొరతను ఆసరాగా చేసుకుని మార్కెట్లో నిత్యావసర సరుకుల ధరలను పెంచితే సహించేది లేదని కొల్లు రవీంద్ర వ్యాపారులను హెచ్చరించారు. కృత్రిమ కొరత సృష్టించి ఎక్కువ ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు ఉంటాయన్నారు. ప్రజలు ఎలాంటి అభద్రతా భావానికి గురికావాల్సిన అవసరం లేదని, ధరలను అదుపు చేయడానికి ముఖ్యమంత్రి ఇప్పటికే ఒక ప్రత్యేక కమిటీని నియమించారని తెలిపారు. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ నేతృత్వంలో పనిచేస్తున్న ఈ కమిటీ, రాష్ట్రవ్యాప్తంగా మార్కెట్ ధరలను నిరంతరం పర్యవేక్షిస్తుందని మంత్రి స్పష్టం చేశారు.

Go Back to Shorts
Kollu Ravindra
TDP Mahanadu
Chandrababu Naidu
Online Mahanadu
Andhra Pradesh Politics
Telugu Desam Party
Digital Mahanadu
Narendra Modi
Fuel Crisis
Price Hike

More Telugu News