సైబర్ నేరాలకు చెక్.. ఏపీలో 90 రోజుల యాక్షన్ ప్లాన్ ప్రకటించిన డీజీపీ

Harish Kumar Gupta Announces 90 Day Action Plan for Cyber Crime in AP
  • రాష్ట్రంలో 'ఏపీ సైబర్ గార్డ్' పేరుతో కొత్త వ్యవస్థ ఏర్పాటు
  • సైబర్ నేరాల కట్టడికి 90 రోజుల ప్రత్యేక కార్యాచరణ
  • ఫిర్యాదు చేసిన 30 నిమిషాల్లోనే రికవరీకి చర్యలు
  • తొలిదశలో 500 మంది సిబ్బందికి ప్రత్యేక శిక్షణ
  • సోషల్ మీడియా దుష్ప్రచారంపై కఠిన చర్యలకు ఆదేశం
రాష్ట్రంలో పెరిగిపోతున్న సైబర్ నేరాలను అరికట్టేందుకు ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ నడుం బిగించింది. 'ఏపీ సైబర్ గార్డ్' పేరుతో కొత్త విభాగాన్ని ఏర్పాటు చేయడంతో పాటు, 90 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ప్రకటించారు. సైబర్ ఆర్థిక మోసాలకు గురైన బాధితులు వీలైనంత త్వరగా తమ డబ్బును తిరిగి పొందేలా చర్యలు చేపట్టడమే ఈ ప్రణాళిక ముఖ్య ఉద్దేశం.

ఈ మేరకు శుక్రవారం మంగళగిరిలోని పోలీస్ హెడ్‌క్వార్టర్స్ నుంచి ఎస్పీలు, కమిషనర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సైబర్ మోసాల్లో డబ్బు పోగొట్టుకున్న బాధితులకు తొలి 30 నిమిషాలు అత్యంత కీలకమని, అందుకే 'గోల్డెన్ అవర్' విధానంపై దృష్టి సారించినట్లు డీజీపీ తెలిపారు. డీజీపీ మాట్లాడుతూ.. "1930 హెల్ప్‌ లైన్‌కు సైబర్‌ నేరాల బాధితులు ఫిర్యాదు చేశాక తొలి 30 నిమిషాలు అత్యంత కీలకం. ఈలోగా పోలీసులు స్పందిస్తే బాధితులు పోగొట్టుకున్న సొత్తు తిరిగి రాబట్టడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అందుకే బ్యాంకుల్లో 30 నిమిషాల పాటు లియన్‌ మార్కింగ్‌ (నేరగాళ్ల ఖాతాల్లోకి సొమ్ము జమకాకుండా నిలుపుదల) తప్పనిసరి చేస్తున్నాం," అని వివరించారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఈ పటిష్టమైన ప్రణాళికను రూపొందించారు. ఇందులో భాగంగా ఆరు సూత్రాల వ్యూహాన్ని అమలు చేయనున్నారు. 24/7 సైబర్ వార్ రూమ్ ఏర్పాటు, ఏఐ ఆధారిత పర్యవేక్షణ, తొలి దశలో 500 మంది అధికారులకు శిక్షణ వంటివి ఇందులో ఉన్నాయి. రాష్ట్రంలో 1930 టోల్ ఫ్రీ నంబర్‌కు ఇప్పటివరకు 9.29 లక్షల ఫిర్యాదులు రాగా, బాధితులు రూ.652 కోట్లు కోల్పోయినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ కొత్త చర్యలతో సైబర్ నేరగాళ్ల ఆటకట్టించి, ప్రజలకు భద్రత కల్పించడమే లక్ష్యంగా పోలీస్ శాఖ ముందుకు సాగుతోంది.
Go Back to Shorts
Harish Kumar Gupta
AP Cyber Guard
cyber crime Andhra Pradesh
cyber fraud
Andhra Pradesh police
1930 helpline
cyber security India
Chandrababu Naidu
cyber financial crimes

More Telugu News