గ్లోబల్ డిఫెన్స్ మ్యాప్‌లో ఏపీ.. పవన్ కల్యాణ్ ప్రశంసలు
- పుట్టపర్తిలో యుద్ధ విమానాల తయారీ పరిశ్రమకు శంకుస్థాపన
- చారిత్రాత్మక ఘట్టమన్న పవన్ కల్యాణ్
- పారిశ్రామికంగా ఏపీ వేగంగా అభివృద్ధి చెందుతోందని వ్యాఖ్య
ఆంధ్రప్రదేశ్‌ను గ్లోబల్ డిఫెన్స్ మ్యాప్‌లో నిలిపే దిశగా రూ. 15,803 కోట్ల భారీ పెట్టుబడితో కూటమి ప్రభుత్వం చేపట్టిన మెగా ప్రాజెక్టులపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. ఏపీ పారిశ్రామిక చరిత్రలోనే ఇదొక చారిత్రాత్మక ఘట్టమని ఆయన అభివర్ణించారు.
శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో 650 ఎకరాల్లో ఏర్పాటు కాబోతున్న ‘ఎయిర్‌క్రాఫ్ట్ ఇంటిగ్రేషన్ అండ్ ఫ్లైట్ టెస్ట్ సెంటర్’ దేశ రక్షణలో కీలకం కానుంది. స్వదేశీ సాంకేతికతతో తయారవుతున్న ఐదో తరం స్టెల్త్ యుద్ధ విమానం 'ఆమ్కా' ప్రాజెక్టులో ఏపీ భాగస్వామ్యం కావడం గర్వకారణమని ఆయన పేర్కొన్నారు. ఇది ప్రధాని మోదీ 'ఆత్మనిర్భర్ భారత్' లక్ష్యానికి మరింత బలాన్ని చేకూరుస్తుందని తెలిపారు.
ఈ భారీ పెట్టుబడుల ద్వారా రాష్ట్రంలో సుమారు 7,500 మంది యువతకు హై-వాల్యూ టెక్నాలజీ రంగాల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. కేవలం విమానాల తయారీ మాత్రమే కాకుండా, రాష్ట్రంలో అత్యాధునిక ‘డ్రోన్ ఎకోసిస్టమ్’ను అభివృద్ధి చేయడం ద్వారా డ్రోన్ టెక్నాలజీలో కూడా ఏపీ అగ్రగామిగా నిలవబోతోందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం పారిశ్రామికంగా వేగంగా అభివృద్ధి చెందుతోందని పవన్ కొనియాడారు. ఈ భారీ ప్రాజెక్టు ఏపీకి రావడానికి సహకరించిన ప్రధాని మోదీకి, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.