భారత్ నే నమ్ముతున్న రష్యా.. పాకిస్థాన్‌ను నమ్మని పలు దేశాలు

  • బ్రిక్స్ సమావేశంలో రష్యా విదేశాంగ మంత్రి సంచలన ప్రతిపాదన
  • అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలను తగ్గించడంలో పాకిస్థాన్‌ది తాత్కాలిక సాయం మాత్రమేనని వ్యాఖ్య
  • భారత్ మాత్రమే శాశ్వత పరిష్కారం తీసుకురాగలదని వెల్లడి

న్యూఢిల్లీ వేదికగా జరిగిన బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశంలో రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ కీలక ప్రతిపాదన చేశారు. అమెరికా-ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించడంలో భారతదేశం ఒక దీర్ఘకాలిక మధ్యవర్తి  పాత్రను పోషించగలదని ఆయన వ్యాఖ్యానించారు.


ప్రస్తుతం అమెరికా-ఇరాన్ మధ్య పాకిస్థాన్ మధ్యవర్తిత్వం వహిస్తున్నప్పటికీ, అది ఆశించిన ఫలితాలను ఇవ్వడం లేదు. పాకిస్థాన్ కేవలం అమెరికా ప్రతిపాదనలను మాత్రమే తమ ముందు ఉంచుతోందని... తమ వాదనలను పట్టించుకోవడం లేదని ఇరాన్ ఇప్పటికే ఆరోపించింది. అంతేకాకుండా, ఇజ్రాయెల్, యూఏఈ వంటి దేశాలు కూడా పాక్ మధ్యవర్తిత్వాన్ని అనుమానిస్తున్నాయి. అమెరికా సెనెటర్ లిండ్సే గ్రాహం వంటి వారు కూడా పాకిస్థాన్‌ను విశ్వసించలేమని బహిరంగంగానే వ్యాఖ్యానించారు.


"తాత్కాలికంగా పాకిస్థాన్ సహాయం చేయవచ్చు. కానీ సుదీర్ఘ దౌత్య అనుభవం, విశ్వసనీయత ఉన్న భారత్ మాత్రమే అమెరికా-ఇరాన్ మధ్య శాశ్వత పరిష్కారాన్ని తీసుకురాగలదు" అని లావ్రోవ్ స్పష్టం చేశారు. దీనికి ప్రధాన కారణం భారతదేశానికి అటు అమెరికాతోనూ, ఇటు ఇరాన్‌తోనూ ఉన్న బలమైన వ్యూహాత్మక, ఆర్థిక సంబంధాలే. రష్యా చేసిన ఈ ప్రతిపాదన పాకిస్థాన్‌కు దౌత్యపరంగా పెద్ద దెబ్బ అని విశ్లేషకులు భావిస్తున్నారు.


ఇరాన్ తన సైనిక విమానాలను అమెరికా, ఇజ్రాయెల్ దాడుల నుంచి రక్షించుకోవడానికి పాకిస్థాన్‌లోని 'నూర్ ఖాన్' ఎయిర్ బేస్‌ను వాడుకుంటోందని అమెరికన్ మీడియా కథనాలు వెలువరించడం కూడా పాకిస్థాన్ విశ్వసనీయతను దెబ్బతీసింది. ఇటువంటి పరిస్థితుల్లో ఒక తటస్థ, శక్తివంతమైన దేశంగా భారత్ పాత్ర కీలకం కానుంది.


Sergey Lavrov
Russia
India
Pakistan
Iran
US relations
diplomacy
foreign policy
BRICS
Noor Khan airbase

More Telugu News