పన్ను ఎగవేతలకు ఏఐ అస్త్రం.. ఆదాయ వృద్ధికి సీఎం చంద్రబాబు కొత్త వ్యూహం

Chandrababu Naidu Aims Revenue Growth Through AI in Key Sectors
  • పన్ను ఎగవేతలను అరికట్టేందుకు ఏఐ టెక్నాలజీ వినియోగం
  • 2026-27 ఆర్థిక సంవత్సరానికి రూ.1,27,506 కోట్ల ఆదాయం లక్ష్యం
  • ఖనిజాలకు విలువ జోడించి ఆదాయం పెంచుకోవాలని సూచన
  • పన్ను చెల్లింపుదారులను వేధించకుండా టెక్నాలజీతో వసూళ్లు చేయాలని ఆదేశం
  • ఎర్రచందనం ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్లో విక్రయించేలా ప్రణాళిక
పన్ను ఎగవేతలను అరికట్టి, ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్న లీకేజీలను సమూలంగా మూసివేసేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీని ఒక ఆయుధంగా వినియోగించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. వాణిజ్య పన్నులు, ఎక్సైజ్, గనులు, రవాణా వంటి కీలక శాఖల్లో ఏఐ ఆధారిత టూల్స్ వాడటం ద్వారా పన్ను ఎగవేతలను గుర్తించి, నిబంధనల ఉల్లంఘనలను నివారించాలని స్పష్టం చేశారు. ఏఐ ఆధారిత జీఎస్టీ రిటర్న్స్ స్క్రూటినీ వంటి విధానాలతో పారదర్శకత పెంచాలని, అయితే పన్ను చెల్లింపుదారులను ఎలాంటి వేధింపులకు గురిచేయకుండా టెక్నాలజీ సాయంతో వసూళ్లు జరపాలని ఆయన దిశానిర్దేశం చేశారు.

గురువారం సచివాలయంలో ఆదాయార్జన శాఖలపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.1,27,506 కోట్ల భారీ ఆదాయాన్ని లక్ష్యంగా నిర్దేశించుకున్నామని, దానికి అనుగుణంగా పనిచేయాలని అధికారులకు సూచించారు. 

గడిచిన 2025-26 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర సొంత ఆదాయం రూ.1,10,643 కోట్లుగా నమోదైందని, ఇది అంతకుముందు ఏడాదితో పోలిస్తే 6 శాతం అధికమని అధికారులు సీఎంకు వివరించారు. ఈ వృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్లాలని చంద్రబాబు అన్నారు. పొరుగు రాష్ట్రాల ఆదాయ పద్ధతులను విశ్లేషించి, మన రాష్ట్రంలోనూ ఆదాయాన్ని పెంచుకునే మార్గాలను అన్వేషించాలని సూచించారు.

విలువ జోడింపుతో ఖనిజాలకు కొత్త కళ

రాష్ట్రంలో ఉన్న సహజ వనరులను ఆదాయ వనరులుగా మార్చుకోవాలని ముఖ్యమంత్రి అన్నారు. ఖనిజాలకు విలువ జోడింపు (వాల్యూ అడిషన్) చేయడం ద్వారా గనుల శాఖ ఆదాయాన్ని గణనీయంగా పెంచుకోవచ్చని తెలిపారు. ముఖ్యంగా ప్రపంచంలోనే అరుదైన ఎర్రచందనాన్ని అంతర్జాతీయ మార్కెట్లలో విక్రయించేలా చూడాలని, దాని నుంచి విలువ ఆధారిత ఉత్పత్తులను తయారు చేయడం ద్వారా రాష్ట్రానికి భారీ ఆదాయం సమకూరుతుందని చెప్పారు. అలాగే, రేర్ ఎర్త్ మినరల్స్ ద్వారా కూడా గనుల ఆదాయం పెరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

పెట్టుబడులకు అనుగుణంగా ఆదాయం పెరగాలి

రాష్ట్రానికి పెద్ద ఎత్తున వస్తున్న పెట్టుబడులకు అనుగుణంగా పన్నుల రూపంలో ఆదాయం కూడా పెరగాలని చంద్రబాబు స్పష్టం చేశారు. పెట్టుబడులు వాస్తవరూపం దాల్చుతున్న కొద్దీ జీవీఏ, ఆదాయాలు పెరగాలన్నారు. జిల్లాను ఒక యూనిట్‌గా తీసుకుని గ్రోత్ రేట్ లక్ష్యాలను నిర్దేశించుకుంటే, రాష్ట్రవ్యాప్త లక్ష్యాలను సులభంగా సాధించవచ్చని అభిప్రాయపడ్డారు. స్టాంపులు-రిజిస్ట్రేషన్ల శాఖలో లావాదేవీలు పెరుగుతున్నాయని, 22ఏ వంటి భూ వివాదాలు పరిష్కారమైతే ఆదాయం మరింత పెరుగుతుందని అంచనా వేశారు. 

వాహనాల రిజిస్ట్రేషన్లను 24 గంటల్లో పూర్తి చేయాలని, ఈవీ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించాలని రవాణా శాఖకు సూచించారు. పురపాలక, పంచాయతీరాజ్ శాఖల్లో పన్నుల వసూళ్లను క్రమబద్ధీకరించాలని, జీఐఎస్, డ్రోన్ సర్వేల ద్వారా అక్రమ నిర్మాణాలను గుర్తించి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై ప్రత్యేక దృష్టి సారించాలని, ప్రభుత్వ ఆదాయంలో ప్రతీ రూపాయి సద్వినియోగం కావాలని స్పష్టం చేశారు. ఈ సమీక్షా సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్‌తో పాటు పలు కీలక శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Go Back to Shorts
Chandrababu Naidu
Andhra Pradesh
tax evasion
artificial intelligence
AI
revenue growth
mining
excise
GST
investments

More Telugu News