ఇక ఫస్టియర్ లోనూ ప్రాక్టికల్స్... తెలంగాణ ఇంటర్ లో కీలక మార్పులు!

Telangana Intermediate Board Introduces Practical Exams in First Year
  • విద్యార్థుల్లో ప్రాక్టికల్స్ నాలెడ్జ్, కాన్సెప్ట్ ఆధారిత అభ్యాసం పెంచడమే లక్ష్యంగా మార్పులు
  • 2026-27 ఆర్థిక సంవత్సరం నుంచి కొత్త విధానం అమలు
  • ఇంటర్ ఫస్టియర్ నుంచే ప్రాక్టికల్స్
ఇంటర్ విద్యా విధానంలో కీలక మార్పులు చేపట్టేందుకు తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యామండలి సిద్ధమైంది. 2026-27 ఆర్థిక సంవత్సరం నుంచి కొత్త విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. ఫస్టియర్ నుంచి ప్రాక్టికల్స్, ఫైనల్ పరీక్షకు మార్కుల తగ్గింపు వంటి వివిధ మార్పులు చోటుచేసుకోనున్నాయి. విద్యార్థుల్లో ప్రాక్టికల్ నాలెడ్జ్, కాన్సెప్ట్ ఆధారిత అభ్యాసం పెంచడమే లక్ష్యంగా మార్పులు చేసింది.

ఇప్పటి వరకు ఇంటర్ సెకండియర్‌లో ప్రాక్టికల్స్ నిర్వహించేవారు. ఇక నుంచి ఫస్టియర్ నుంచే ప్రాక్టికల్స్ ఉంటాయి. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ విభాగాల్లో మొదటి సంవత్సరం విద్యార్థులకు ప్రాక్టికల్స్ నిర్వహిస్తారు. ఫస్టియర్, సెకండియర్‌లలో 15 మార్కుల చొప్పున ప్రాక్టికల్స్ నిర్వహణ ఉంటుంది. దీంతో విద్యార్థులు ఫస్టియర్‌లోనూ థియరీతో పాటు ప్రయోగాత్మక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసుకోవాల్సి ఉంటుంది.

మ్యాథ్స్ బోధనలోనూ సంప్రదాయ పద్ధతికి భిన్నంగా, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్‌ను తీసుకురానుంది. దీని ద్వారా విద్యార్థులు సూత్రాలను సులభంగా అర్థం చేసుకోవడం, సమస్య పరిష్కార నైపుణ్యాలు పెంపుందించుకోవడం, కాన్సెప్ట్ ఆధారిత విద్యను అభ్యసించడానికి అవకాశం ఉంటుంది. ప్రస్తుతం మ్యాథ్స్‌లో 75 మార్కులకు ఫైనల్ పరీక్షలు ఉన్నాయి. ఈ మార్కులను 60కి తగ్గించే అవకాశముంది. మిగిలిన మార్కులను ఇంటర్నల్ అసెస్‌మెంట్ ప్రాక్టికల్స్, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ ఆధారంగా మిగిలిన మార్కులను కేటాయించవచ్చని సమాచారం.

తెలుగు, హిందీ, ఇంగ్లీష్ వంటి భాషా విభాగాల్లో కూడా 20 మార్కులను ఇంటర్నల్ అసెస్‌మెంట్ కింద కేటాయించనుంది. సెమినార్లు, అసైన్‌మెంట్లు, క్లాస్ రూమ్ పనితీరు ఆధారంగా మార్కులు కేటాయించే అవకాశం ఉంది. ఈ కొత్త విధానం ద్వారా విద్యార్థులపై పరీక్షల ఒత్తిడి కొంతమేర తగ్గించే అవకాశం ఉందని విద్యావేత్తలు భావిస్తున్నారు.

దీంతో కేవలం ఫైనల్ పరీక్ష ఆధారంగా మాత్రమే కాకుండా, సంవత్సరం పొడువునా విద్యార్థుల పనితీరును అంచనా వేసే విధానం అమల్లోకి వస్తుంది. విద్యర్థుల్లో సృజనాత్మకత, విశ్లేషణాత్మక ఆలోచన, ప్రాక్టికల్ నాలెడ్జ్ పెంపొందించే లక్ష్యంతో జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా ఇంటర్ బోర్డు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
Go Back to Shorts
Telangana Intermediate Board
Telangana
Intermediate education
Practical exams
First year
Internal assessment

More Telugu News