ఉదయనిధి స్టాలిన్ పై రాష్ట్రపతికి ఫిర్యాదు చేసిన తెలంగాణ న్యాయవాది
- సనాతన ధర్మంపై మళ్లీ అనుచిత వ్యాఖ్యలు చేసిన ఉదయనిధి
- రాష్ట్రపతి కార్యాలయంలో ఫిర్యాదు చేసిన న్యాయవాది రామారావు
- కోట్లాది హిందువుల మనోభావాలు దెబ్బతినేలా ఉదయనిధి వ్యాఖ్యలు ఉన్నాయని ఫిర్యాదు
- ఆయన వ్యాఖ్యలు మీడియాలో, సోషల్ మీడియాలో ప్రసారం కాకుండా చర్యలు తీసుకోవాలని విన్నపం
తమిళనాడు మాజీ ఉప ముఖ్యమంత్రి, డీఎంకే శాసనసభాపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలు మళ్లీ విమర్శలపాలు అవుతున్నాయి. తమిళనాడు అసెంబ్లీలో ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం కార్యక్రమం సందర్భంగా కూడా సభలో ఆయన సనాతన ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడారు. గతంలో కూడా సనాతన ధర్మంపై ఆయన చాలా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మం మలేరియా, డెంగీ వంటిదని... దాన్ని అంతం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ వ్యాఖ్యల ప్రభావం డీఎంకేపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. ఎన్నికల్లో డీఎంకే ఓడిపోవడానికి ఈ వ్యాఖ్యలు కూడా ఒక ప్రధాన కారణమే.
మరోవైపు సనాతనంపై ఉదయనిధి చేసిన వ్యాఖ్యలపై తెలంగాణకు చెందిన హక్కుల న్యాయవాది రామారావు ఏకంగా భారత రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు. రాష్ట్రపతి కార్యాలయంలో ఉదయనిధి స్టాలిన్‌పై అధికారికంగా ఫిర్యాదు చేశారు. ఉదయనిధి వ్యాఖ్యలు కేవలం ఒక భావప్రకటన మాత్రమే కాదని, అవి కోట్లాది మంది హిందువుల మత విశ్వాసాలను తీవ్రంగా గాయపరిచేలా ఉన్నాయని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
సనాతన ధర్మంపై ఉదయనిధి చేసిన విమర్శలు సమాజంలో విద్వేషాలను పెంచే ప్రమాదం ఉందని రామారావు ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే, ఆయన చేసిన ఆ వివాదాస్పద వ్యాఖ్యలు మీడియాలో కానీ, డిజిటల్ సోషల్ మీడియా వేదికల్లో కానీ ప్రసారం కాకుండా తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన రాష్ట్రపతిని అభ్యర్థించారు.