హైదరాబాదులో విషాద ఘటన... హాస్టల్ లిఫ్టులో చిక్కుకుని చిన్నారి మృతి

  • మహిళా హాస్టల్‌ గ్రిల్ లిఫ్ట్‌‌లో జుట్టు ఇరుక్కుని దుర్ఘటన
  • మృతురాలు పశ్చిమ బెంగాల్‌కు చెందిన బిస్తు ఘోష్‌గా గుర్తింపు
  • హాస్టల్ యజమాని, నిర్వాహకుడిపై నిర్లక్ష్యం కింద కేసు నమోదు
హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో తీవ్ర విషాద ఘటన జరిగింది. గౌలిదొడ్డిలోని ఓ మహిళా హాస్టల్‌ లిఫ్ట్‌లో చిక్కుకుని ఐదేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. మృతురాలిని పశ్చిమ బెంగాల్‌కు చెందిన బిస్తు ఘోష్‌ (5)గా పోలీసులు గుర్తించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, జీవనోపాధి కోసం నగరానికి వలస వచ్చిన చిన్నారి కుటుంబం, గౌలిదొడ్డిలోని మహి మహిళా హాస్టల్‌లో వంట పని చేసుకుంటోంది. నిన్న మధ్యాహ్నం, బాలిక హాస్టల్‌లోని గ్రిల్ లిఫ్ట్‌లో ప్రయాణిస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. లిఫ్ట్ పైకి వెళ్తున్న సమయంలో, మూడో అంతస్తు వద్ద బాలిక జుట్టు గ్రిల్‌లో చిక్కుకుపోయింది. దీంతో తలకు తీవ్ర గాయాలై చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది.

స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న గచ్చిబౌలి పోలీసులు, అగ్నిమాపక సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. లిఫ్ట్‌లో ఇరుక్కుపోయిన బాలిక మృతదేహాన్ని అతికష్టం మీద బయటకు తీశారు. ఈ ఘటనలో లిఫ్ట్ నిర్వహణలో తీవ్ర నిర్లక్ష్యం వహించారని ఆరోపిస్తూ హాస్టల్ యజమాని దీపాన్ష్ గోయల్, నిర్వాహకుడు మల్లికార్జున్ రెడ్డిపై నిర్లక్ష్యం కారణంగా మృతి (సెక్షన్ 106(1)) కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చిన్నారి మృతితో ఆమె తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
 

Bistu Ghosh
Hyderabad
Gachibowli
Hostel lift accident
Child death
Lift accident
Telangana
negligence
Deepansh Goyal
Mallikarjun Reddy

More Telugu News