రేవంత్ రెడ్డిని తనతో కలవమని మోదీ వ్యాఖ్య.. స్పందించిన కాంగ్రెస్ ఎంపీ

  • ఇతర రాజకీయ పార్టీలు ఉండకూడదనే లక్ష్యంతో మోదీ పనిచేస్తున్నారని విమర్శ
  • మోదీతో ఉంటేనే అభివృద్ధి జరుగుతుందా అని ఆగ్రహం
  • గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు మోదీ కోరినట్లుగానే ఇప్పుడు రేవంత్ రెడ్డి అడిగారన్న ఎంపీ
మీరు అనుకున్నది సాధించాలంటే తనతో కలవాలని ప్రధాని నరేంద్రమోదీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో అనడాన్ని కాంగ్రెస్ పార్టీ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తప్పుబట్టారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, దేశంలో ఇతర రాజకీయ పార్టీలు ఉండకూడదనే లక్ష్యంతో మోదీ పనిచేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ భవిష్యత్తు కోసం తమకు సహకరించాలని ప్రధాని మోదీకి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారని అన్నారు.

కానీ ప్రధాని మాత్రం తనతో కలిస్తే మీరు అనుకున్నది సాధిస్తారని రేవంత్ రెడ్డిని ఉద్దేశించి అనడం సరికాదని అన్నారు. దేశంలో ప్రతిపక్షాలకు బలమైన నాయకులు ఉండవద్దని ఆయన కోరుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీతో ఉంటేనే అభివృద్ధి జరుగుతుందా అని దుయ్యబట్టారు. ఆయన అన్ని రాష్ట్రాలకు ప్రధానమంత్రే అని వ్యాఖ్యానించారు. ఫెడరల్ సిస్టంలో అన్ని రాష్ట్రాలను సమానంగా చూడాలని అన్నారు.

గత రెండున్నరేళ్లుగా సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని మోదీ, కేంద్రమంత్రులను కలుస్తూ రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి అడుగుతున్నారని తెలిపారు. మోదీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు తమకు సహకరించాలని ఎలాగైతే మన్మోహన్ సింగ్‌ను కోరారో, ఇప్పుడు రేవంత్ రెడ్డి అలాగే కోరారని తెలిపారు. మన్మోహన్ హయాంలో ఇచ్చినట్లు ఇస్తే ఇప్పుడు వచ్చే దాంట్లో సగం కూడా రావని ప్రధాని చెప్పడం విడ్డూరంగా ఉందని అన్నారు.

కాంగ్రెస్ హయాంలోనే ఎన్నో జాతీయ సంస్థలు ఏర్పడ్డాయని చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. పశ్చిమ బెంగాల్‌లా తెలంగాణను కైవసం చేసుకుందామని మోదీ భావిస్తున్నారని ప్రభుత్వ విప్ బీర్ల యాదయ్య మండిపడ్డారు. ఆ రాష్ట్రంలో బీజేపీ ఎలా గెలిచిందో దేశమంతా చూసిందని అన్నారు. తెలంగాణలో బీజేపీ పప్పులు ఉడకవని, మళ్లీ గెలిచేది కాంగ్రెస్ పార్టీయే అన్నారు. రేవంత్ రెడ్డి మరోసారి ముఖ్యమంత్రి కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ, బీఆర్ఎస్ కలిసి వచ్చినా కాంగ్రెస్ పార్టీకి పోటీ కాదని అన్నారు.

Revanth Reddy
Chamala Kiran Kumar Reddy
Narendra Modi
Telangana
Congress
BJP
Federal System

More Telugu News