ఇంధనం వినియోగం తగ్గించాలని మోదీ పిలుపు.. ఇంధన నిల్వలపై కేంద్రం కీలక ప్రకటన

  • మన దేశంలో మాత్రం ఇంధన సరఫరా సజావుగా సాగుతోందన్న సుజాత శర్మ
  • చమురు రంగ కంపెనీలకు ప్యాకేజీ ఇచ్చే ఉద్దేశం లేదని స్పష్టీకరణ
  • పెట్రోల్, డీజిల్ లేదా గ్యాస్ కొరత లేదన్న సుజాత శర్మ
అంతర్జాతీయ మార్కెట్లో ఇంధన ధరల్లో తీవ్ర అస్థిరత ఉన్నప్పటికీ, మన దేశంలో మాత్రం ఇంధన సరఫరా సజావుగా సాగుతోందని పెట్రోలియం మరియు సహజవాయువు మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ సుజాత శర్మ తెలిపారు. దేశ ప్రజలు పొదుపు మంత్రాన్ని పాటించాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. మరోవైపు, పశ్చిమాసియాలో యుద్ద ప్రభావం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన కీలక భేటీ నిర్వహించారు.

అనంతరం సుజాత శర్మ మాట్లాడుతూ, చమురు రంగ కంపెనీలకు ప్యాకేజీ ఇచ్చే ఉద్దేశం లేదని అన్నారు. భారత మార్కెట్లో సాధారణ వినియోగదారులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకున్న సమర్థవంతమైన చర్యల వల్ల దేశంలో ముడి చమురు నిల్వలు సంతృప్తికరంగా ఉన్నాయని తెలిపారు. దేశంలో ప్రస్తుతం ఆయిల్ రిఫైనరీలు పూర్తిస్థాయిలో పనిచేస్తున్నాయని అన్నారు.

మన దేశంలో పెట్రోల్, డీజిల్ లేదా గ్యాస్ కొరత లేదని స్పష్టం చేశారు. స్టాక్ తగినంత అందుబాటులో ఉందని తెలిపారు. గృహ అవసరాల కోసం ఎల్పీజీ సరఫరాను నిరంతరం కొనసాగిస్తున్నామని అన్నారు. గడిచిన మూడు రోజుల్లో 1 కోటి 14 లక్షల బుకింగ్‌లకు గాను 1 కోటి 26 లక్షల ఎల్పీజీ సిలిండర్లను గృహాలకు పంపిణీ చేసినట్లు తెలిపారు. వాణిజ్య సిలిండర్ల విక్రయాలు 17,000 టన్నులు, ఆటో ఎల్పీజీ విక్రయాలు 762 టన్నులు దాటినట్లు వెల్లడించారు.

దేశ ప్రజలంతా పెట్రోల్, డీజిల్, గ్యాస్ వినియోగాన్ని తగ్గించాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారని గుర్తు చేశారు. సాధ్యమైన చోట మెట్రో, ఇతర ప్రజారవాణా వ్యవస్థలను ఉపయోగించాలని కోరారు. రైల్వేలకు ప్రాధాన్యత ఇవ్వాలని, విద్యుత్ వాహనాల వినియోగాన్ని పెంచాలని కోరారు. సంక్షోభ సమయంలో ఇంధనం కోసం అందరం కలిసి కట్టుగా కృషి చేయాలని ఆకాంక్షించారు.

Narendra Modi
Fuel Conservation
India Oil Reserves
Sujata Sharma
Petroleum Ministry
LPG Cylinders
Oil Refineries

More Telugu News