పవన్ క‌ల్యాణ్ సీఎం స్థాయి నేత.. కానీ బీజేపీతో చేరింది అందుకే!: ఉండవల్లి అరుణ్ కుమార్

Undavalli Arun Kumar Comments on Pawan Kalyan Political Journey
  • డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై తనకు సానుకూల దృక్పథం ఉందన్న‌ ఉండవల్లి
  • బీజేపీతో పవన్ చేరడం రాజకీయ అవసరమేనని వ్యాఖ్య
  • జగన్‌ను గద్దె దించాలనే ఉద్దేశంతోనే పవన్ కూటమికి మద్దతిచ్చారని విశ్లేషణ
  • పవన్‌కు సనాతన ధర్మం కంటే కమ్యూనిస్ట్ సిద్ధాంతాలే ఎక్కువ తెలుసన్న ఉండ‌వ‌ల్లి
  • పవన్ కల్యాణ్ ఒక ముఖ్యమంత్రి స్థాయి నాయకుడని కితాబు
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై తనకు సానుకూల దృక్పథం ఉందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. అయితే, ఆయన రాజకీయ ప్రయాణం, సిద్ధాంతాలపై ఆసక్తికర విశ్లేషణ చేశారు. ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఉండవల్లి మాట్లాడుతూ.. పవన్‌ను తాను ఇప్పటివరకు ఒకసారి మాత్రమే కలిశానని, పునర్విభజన అంశంపై మాట్లాడదామనుకున్నా ఆయన ఆసక్తి చూపలేదని తెలిపారు.

బీజేపీతో పవన్ చేరడం రాజకీయ అవసరమే 
పవన్ కల్యాణ్ రాజకీయ వైఖరిని ఉండవల్లి విశ్లేషించారు. "చిన్నప్పుడు నక్సలైట్లలో చేరదామనుకున్నా" అని పవన్ చెప్పిన మాటలను గుర్తుచేస్తూ, 2019 ఎన్నికల్లో ఆయన కమ్యూనిస్టులతో కలిసి పోటీ చేశారని ప్రస్తావించారు. ఆ తర్వాత బీజేపీతో చేరడం కేవలం రాజకీయ అవసరాల కోసమేనని అభిప్రాయపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో ఎదురైన అవమానాలను భరించలేకే పవన్ ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చన్నారు. జగన్‌ను ఎలాగైనా గద్దె దించాలనే బలమైన ఆకాంక్షతోనే, చంద్రబాబు రాజమండ్రి జైల్లో ఉన్నప్పుడు వెళ్లి మద్దతు ప్రకటించారని, ఇది తనను తాను కాపాడుకోవడానికేనని తాను భావిస్తున్నట్లు ఉండవల్లి పేర్కొన్నారు.

పవన్‌కు సనాతనం ఎక్కలేదు.. కమ్యూనిజమే ఇష్టం
ఇటీవల పవన్ సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలపైనా ఉండవల్లి స్పందించారు. "పవన్ కల్యాణ్‌కు సనాతనం ఎక్కిపోయిందని నేను అనుకోను. ఆయన కమ్యూనిస్ట్ సిద్ధాంతాలను ఎక్కువగా చదివారు. ఏ విషయాన్నైనా గట్టిగా చెబుతారు. ఆయన్ను కలిసినప్పుడు సనాతన ధర్మం గురించి తప్పక అడుగుతాను" అని అన్నారు.

పవన్ కల్యాణ్ ఒక ముఖ్యమంత్రి స్థాయి నాయకుడని, ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో ఆయన పాత్ర ఎంతో కీలకమని ఉండవల్లి అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉంటే... తిరుమల లడ్డూలో కల్తీ అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు 'గొడ్డు మాంసం' వంటి పదాలు వాడటం ప్రజల్లోకి సరైన సంకేతాలు పంపదని, ఇలాంటి విషయాల్లో చట్టం తన పని తాను చేసుకుపోవాలని సూచించారు.
Go Back to Shorts
Undavalli Arun Kumar
Pawan Kalyan
Andhra Pradesh
BJP
communism
political analysis
Chandrababu Naidu
Jagan Mohan Reddy
Tirumala laddu
Sanatana Dharma

More Telugu News