కేరళలోని ఐదు జిల్లాల్లో కాంగ్రెస్ క్లీన్‌స్వీప్.. ఓటమి పాలైన పలువురు మంత్రులు, కీలక నేతలు

Kerala Assembly Elections UDF Wins Big LDF Suffers Losses
  • కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో యూడీఎఫ్ అఖండ విజయం
  • ఐదు జిల్లాల్లో అన్ని స్థానాలనూ కైవసం చేసుకున్న కాంగ్రెస్ కూటమి
  • మూడు స్థానాలు గెలుచుకుని కేరళలో ఖాతా తెరిచిన బీజేపీ
  • పదేళ్ల తర్వాత తిరిగి అధికారంలోకి యూడీఎఫ్
కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (యూడీఎఫ్) ప్రభంజనం సృష్టించింది. పదేళ్ల విరామం తర్వాత తిరిగి అధికార పీఠాన్ని కైవసం చేసుకుంది. సీపీఎం నేతృత్వంలోని లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (ఎల్‌డీఎఫ్) సర్కారుపై తీవ్ర ప్రజా వ్యతిరేకతతో యూడీఎఫ్‌కు ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారు. ఈ ఎన్నికల ఫలితాలు ఎల్‌డీఎఫ్‌కు చారిత్రక ఓటమిని మిగిల్చాయి.

యూడీఎఫ్ హవా ఎంతలా ఉందంటే.. ఏకంగా ఐదు జిల్లాల్లో ఎల్‌డీఎఫ్‌కు ఒక్క సీటు కూడా దక్కకుండా క్లీన్‌స్వీప్ చేసింది. మలప్పురం, వయనాడ్, ఎర్నాకుళం, కొట్టాయం, ఇడుక్కి జిల్లాల్లోని అన్ని స్థానాలనూ యూడీఎఫ్ అభ్యర్థులే గెలుచుకున్నారు. ముఖ్యంగా ఎర్నాకుళంలోని 14 స్థానాల్లో, మలప్పురంలోని 16 స్థానాల్లో యూడీఎఫ్ చారిత్రక విజయం నమోదు చేసింది. కాసర్‌గఢ్, పతనంతిట్ట, కోజికోడ్ జిల్లాల్లో ఎల్‌డీఎఫ్ కేవలం ఒక్కో స్థానానికే పరిమితమైంది.

ఈ ఫలితాలు అధికార ఎల్‌డీఎఫ్‌కు గట్టి షాక్ ఇచ్చాయి. పలువురు మంత్రులు, కీలక నేతలు ఓటమి పాలయ్యారు. మంత్రులు వీణా జార్జ్, వీఎన్ వాసవన్, వి.శివన్‌కుట్టి, ఆర్.బిందు, ఎంబీ రాజేష్‌తో పాటు కేకే శైలజ, కేబీ గణేశ్‌కుమార్, కేటీ జలీల్ వంటి ప్రముఖులు కూడా ఓటమి చవిచూశారు. ఎల్‌డీఎఫ్ కంచుకోటగా భావించే కోజికోడ్‌లో 13 స్థానాలకు గాను 12 చోట్ల యూడీఎఫ్ గెలవగా, మంత్రి పీఏ మహమ్మద్ రియాజ్ మాత్రమే బేపూర్ నుంచి గెలిచి ఎల్‌డీఎఫ్ పరువు నిలిపారు.

మరోవైపు, ఈ ఎన్నికల్లో బీజేపీ మూడు స్థానాల్లో విజయం సాధించి అసెంబ్లీలో అడుగుపెట్టింది. తిరువనంతపురం జిల్లాలోని నెమోమ్, కజకూట్టంలతో పాటు కొల్లాం జిల్లాలోని చాతనూర్‌లో కమలం పార్టీ అభ్యర్థులు గెలిచారు. నటుడు రమేశ్ పిషారోడి యూడీఎఫ్ టికెట్‌పై పోటీ చేసి గెలుపొందడం విశేషం.
Go Back to Shorts
Kerala Assembly Elections
UDF
LDF
Pinarayi Vijayan
Kerala election results
Indian National Congress
CPM
United Democratic Front
Left Democratic Front
Kerala Politics

More Telugu News