‘పలుకుబడి’తో మెప్పించిన తెలిదేవర భానుమూర్తి అస్తమయం

  • హైదరాబాద్‌లోని ఆసుపత్రిలో గుండెపోటుతో కన్నుమూత
  • తెలంగాణ నుడికారం, యాసలో రచనలకు ప్రసిద్ధి
  • ‘పలుకుబడి’, ‘లత్కోర్‌సాబ్‌’ వంటి రచనలతో గుర్తింపు
  • మల్కాజిగిరి శ్మశానవాటికలో నేడు అంత్యక్రియలు
ప్రముఖ రచయిత, సీనియర్ జర్నలిస్టు తెలిదేవర భానుమూర్తి (73) కన్నుమూశారు. గుండెపోటుతో హైదరాబాద్ మల్కాజిగిరి ఆనంద్‌బాగ్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరిన ఆయన, చికిత్స పొందుతూ బుధవారం తుదిశ్వాస విడిచారు. తెలంగాణ నుడికారాన్ని, యాసను తన రచనలతో తెలుగు పాఠకులకు పరిచయం చేసిన ఆయన మృతి సాహిత్య లోకానికి తీరని లోటు.

యాదాద్రి జిల్లా భువనగిరికి చెందిన భానుమూర్తి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎంఏ తెలుగు పూర్తి చేశారు. ప్రభుత్వ వాణిజ్య పన్నుల శాఖలో ఉద్యోగానికి రాజీనామా చేసి జర్నలిజంలోకి ప్రవేశించారు. ‘ఉదయం’ దినపత్రికలో ‘పలుకుబడి’, ‘చల్నేదో బాల్‌కిషన్‌’ వంటి శీర్షికలతో ఆయన రాసిన వ్యంగ్య వ్యాసాలు అప్పట్లో సంచలనం సృష్టించాయి. తెలంగాణ అస్తిత్వ ఉద్యమానికి ముందే తన రచనల ద్వారా ఈ ప్రాంతపు భాషా సౌందర్యాన్ని చాటిచెప్పిన ఘనత ఆయనది.

‘ఊరోల్లు’ కవితాసంకలనం, ‘నెమ్లీక’, ‘ఆక్సిజన్‌ బార్‌’ కథా సంపుటాలు, ‘లత్కోర్‌సాబ్‌’ వ్యంగ్య నవల ఆయనకు తెలుగు సాహిత్యంలో ప్రత్యేక స్థానాన్ని తెచ్చిపెట్టాయి. 1969 తెలంగాణ ఉద్యమంలో పాల్గొని జైలు శిక్ష కూడా అనుభవించారు. భానుమూర్తి మరణవార్త తెలియగానే పలువురు కవులు, రచయితలు, పాత్రికేయులు మల్కాజిగిరిలోని ఆయన నివాసానికి చేరుకుని నివాళులు అర్పించారు.గురువారం ఉదయం 11 గంటలకు మల్కాజిగిరిలోని స్థానిక శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ఆయన కుమారులు అరుణ్‌తేజ్‌, చైతన్య తెలిపారు.

Telidevara Bhanumurthy
Journalist
Telangana
Palukubadi
Hyderabad
Writer

More Telugu News