హిప్పోలను చంపాలనుకున్న కొలంబియా ప్రభుత్వం... అనంత్ అంబానీ విజ్ఞప్తి
- మగ్డలీనా నదీ పరివాహక ప్రాంతంలోని 80 హిప్పోలను చంపాలని నిర్ణయం
- తమ వంతారా జంతు సంరక్షణ కేంద్రంలో నివాసం కల్పిస్తామన్న అనంత్ అంబానీ
- ఈ మేరకు కొలంబియా ప్రభుత్వానికి లేఖ
కొలంబియా పర్యావరణ, సుస్థిర అభివృద్ధి శాఖకు ఈ మేరకు అనంత్ అంబానీ అభ్యర్థనను పంపించారు. ప్రాణం ఉన్న జీవులకు జీవించే హక్కు ఉందని, వాటికి కావాల్సిన సదుపాయాలన్నింటిని, సురక్షితమైన పరిస్థితులను కల్పిస్తామని హామీ ఇచ్చారు. తమ ప్రతిపాదనను సమగ్రంగా అంచనా వేసేవరకు వాటిని చంపాలనుకునే ఆలోచనను విరమించుకోవాలని కోరారు. త్వరలో కొలంబియా అధికారులను సంప్రదిస్తామని పేర్కొన్నారు.
మగ్డలీనా నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న నీటి ఏనుగుల వల్ల అక్కడి జీవవైవిధ్యానికి, పర్యావరణ వ్యవస్థకు హాని కలుగుతుందని, వాటిని చంపేయాలని కొలంబియా ప్రభుత్వం నిర్ణయించింది. దీనితో వాటిని చంపకూడదని, తమ వంతారాలో రక్షణ కల్పిస్తామని అనంత్ అంబానీ ప్రతిపాదన చేశారు.
ఈ హిప్పోల వెనుక ఆసక్తికర కథ ఉంది. వీటిని డ్రగ్ మాఫియా కింగ్ ఎస్కోబార్ తన సొంత జూ కోసం ఆఫ్రికా నుంచి తీసుకువచ్చాడు. అయితే, అతడిని అరెస్ట్ చేశాక, వీటికి ఆలనాపాలనా కరవైంది. అప్పటినుంచి అవి మగ్దలీనా నదీ తీరంలో మనుగడ సాగిస్తున్నాయి. వీటి సంతతి పెరిగిపోవడంతో ప్రజాజీవనం ప్రమాదంలో పడింది.