ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు అంగీకరించాం: మంత్రి పొన్నం ప్రభాకర్

  • రెండు రోజుల సమ్మెలోనే పలుమార్లు కార్మికులతో చర్చలు జరిపామని వెల్లడి
  • కార్మిక సంఘాల ఎన్నికలు, 11 శాతం పీఆర్సీ ప్రకటనకు అంగీకరించినట్లు వెల్లడి
  • ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామన్న మంత్రి
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం సహా పలు డిమాండ్లకు తమ ప్రభుత్వం అంగీకరించిందని తెలంగాణ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ డీసీసీ అధ్యక్షులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్‌లు , అధికార ప్రతినిధులతో ఆయన వర్చువల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రెండు రోజుల సమ్మెలోనే పలుమార్లు కార్మికులతో చర్చలు జరిపినట్లు తెలిపారు.

వారి చిరకాల స్వప్నమైన ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం, కార్మిక సంఘాల ఎన్నికలు, 11 శాతం పీఆర్సీ ప్రకటన పట్ల ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని తెలిపారు. ప్రభుత్వం డిమాండ్లకు అంగీకరించడంతో కార్మికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలపై మంత్రుల బృందం సుమారు 15 గంటలు చర్చించి వారి సమస్యలను పరిష్కరించి, సమ్మెను విరమింపజేశారని అన్నారు.

ఆర్టీసీ కార్మికుల అంశాలపై ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నందుకు రాష్ట్రవ్యాప్తంగా పార్టీ కేడర్ సంబరాలు నిర్వహించాలని సూచించారు. ఆర్టీసీ కార్మికుల ప్రధాన డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించిందని అన్నారు. ఆర్టీసీ విలీనం, కార్మిక సంఘాల ఎన్నికల నిర్వహణ, ఉద్యోగులకు 11 శాతం పీఆర్సీ ప్రకటనతో పాటు మిగిలిన సమస్యలను కూడా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

గతంలో కార్మికులు 55 రోజుల పాటు సమ్మె చేస్తే గత ప్రభుత్వం ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని ఆరోపించారు. ఆ రోజు సమ్మె సమయంలో 30 మంది ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టీసీ కార్మికులతో ప్రభుత్వానికి శత్రుత్వం ఉండదని, వారు కూడా కుటుంబ సభ్యులే అన్నారు. ఆత్మహత్య చేసుకున్న డ్రైవర్ శంకర్ గౌడ్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు.

ప్రజా రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె సమయంలో బీజేపీ, బీఆర్ఎస్ వ్యవహరించిన తీరు సరికాదని అన్నారు. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ శవరాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు.

ఎన్నికల సమయంలో మనం ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామని మంత్రి తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఉద్యోగ నియామకాలు, కారుణ్య నియామకాలు, సర్వీసు నుంచి తొలగించిన వారిని ఉద్యోగాల్లోకి తీసుకోవడం జరిగిందని అన్నారు. రోజుకు 65 లక్షల మంది ప్రయాణికులు ఆర్టీసీలో ప్రయాణం చేస్తున్నారని తెలిపారు.

Ponnam Prabhakar
RTC merger
Telangana RTC
RTC strike
Congress party
PRC announcement

More Telugu News