జూన్ నాటికి అనకాపల్లి వరకు పోలవరం జలాలు: నిమ్మల రామానాయుడు

Godavari water reaches till Anakapalli by June says Nimmala Rama Naidu
  • ఉత్తరాంధ్ర నీటి సమస్యలు తీర్చడంలో గోదావరి జలాలు అత్యంత కీలకమన్న నిమ్మల
  • జూన్ నాటికి అనకాపల్లి వరకు గోదావరి జల్లాలు తరలించాలని సీఎం ఆదేశించారని వెల్లడి
  • పనుల్లో జాప్యాన్ని సహించేది లేదని ఏజెన్సీలకు వార్నింగ్

ఉత్తరాంధ్ర జిల్లాల సాగు, తాగు, పారిశ్రామిక అవసరాలను తీర్చడంలో గోదావరి జలాలు అత్యంత కీలకమని, ఈ నీటిని తరలించేందుకు పోలవరం ఎడమ కాలువే ప్రధాన ఆధారమని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. జూన్ నాటికి మొదటి దశ పనులను పూర్తి చేసి, అనకాపల్లి వరకు గోదావరి జలాలను తరలించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించినట్లు ఆయన వెల్లడించారు. 


కాకినాడ జిల్లా అన్నవరంలో పంపా ఆక్విడక్ట్ వద్ద పోలవరం ఎడమ ప్రధాన కాలువ పనులను మంత్రి ఈరోజు స్వయంగా పరిశీలించారు. ఆరెంపూడి, గవరయ్య కోనేరు గ్రామాల సమీపంలో నేషనల్ హైవే క్రాసింగ్ వద్ద జరుగుతున్న వంతెనల నిర్మాణ పనులను పర్యవేక్షించిన ఆయన, అనంతరం తుని ఆర్‌ అండ్‌ బీ గెస్ట్ హౌస్‌లో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.


ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, పనుల్లో జాప్యాన్ని ఏమాత్రం సహించేది లేదని ఏజెన్సీలను హెచ్చరించారు. ముఖ్యంగా హైవే క్రాసింగ్ వద్ద వంతెన నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. అనకాపల్లి కేంద్రంగా వస్తున్న భారీ పరిశ్రమలకు నీటి ఎద్దడి లేకుండా చూడటమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో పోలవరం ఎడమ కాలువ కోసం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని మంత్రి ఆరోపించారు. 


జగన్ ప్రభుత్వం ఉత్తరాంధ్ర ప్రజలపై కక్ష గట్టి పనులను ప్రీ-క్లోజర్ చేసిందని, కాలువ సామర్థ్యాన్ని 17,500 క్యూసెక్కుల నుంచి 8,122 క్యూసెక్కులకు తగ్గించి ప్రాంతీయ ప్రయోజనాలకు గండికొట్టారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సీఎం చంద్రబాబు మొదటి ప్రాధాన్యతగా పోలవరం ప్రాజెక్టును, రెండో ప్రాధాన్యతగా ఈ ఎడమ కాలువను సందర్శించారని గుర్తుచేశారు.


ప్రస్తుతం రూ.1,460 కోట్లు ఖర్చు చేసి పనులను పరుగులు పెట్టిస్తున్నామని, ఇప్పటివరకు 76 శాతం పనులు పూర్తయ్యాయని మంత్రి వివరించారు. ఈ ప్రాజెక్టు ద్వారా తుని వరకు ఉన్న 110 మైనర్ ఇరిగేషన్ ట్యాంకులు నిండటం వల్ల 28,557 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరుగుతుందన్నారు. పిఠాపురం అప్ టేక్ స్లూయిస్ నిర్మాణం పూర్తయితే మరో 67,674 ఎకరాల ఏలేరు ఆయకట్టుకు లబ్ధి చేకూరుతుందని తెలిపారు. మార్గమధ్యంలో ఉన్న 143 గ్రామాలకు చెందిన 5.23 లక్షల మందికి శాశ్వతంగా తాగునీటి సమస్య తీరుతుందన్నారు. 


అలాగే పాయకారావుపేట ఎగువన ఉన్న 98 ట్యాంకులు నిండటం ద్వారా 48,368 ఎకరాలకు నీరందుతుందని పేర్కొన్నారు. కుమ్మరిలోవ నిర్వాసితులకు రూ.30.38 కోట్ల పరిహారాన్ని అందించినట్లు వెల్లడించిన మంత్రి, ఉత్తరాంధ్రను సస్యశ్యామలం చేయడమే తమ ప్రభుత్వ ధ్యేయమని పునరుద్ఘాటించారు.

Go Back to Shorts
Nimmala Rama Naidu
TDP
Polavaram

More Telugu News