క్రికెట్ దేవుడు, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ నేడు తన 53వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. రికార్డుల రారాజుగా కీర్తి పొందినప్పటికీ, ఆయన కెరీర్ కేవలం పరుగులకే పరిమితం కాలేదు. మైదానంలో లిటిల్‌ మాస్ట‌ర్ ప్రదర్శించిన భావోద్వేగాలు, మానవత్వం, దృఢ సంకల్పం అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేశాయి. ఆయన కెరీర్‌లోని ఐదు అత్యంత భావోద్వేగ క్షణాలను ఓసారి గుర్తుచేసుకుందాం.

1. తండ్రి మరణం.. భావోద్వేగ సెంచరీ (1999)
1999 ప్రపంచకప్ సమయంలో తండ్రి మరణవార్త విని సచిన్ ఇంగ్లండ్ నుంచి భారత్‌కు తిరిగొచ్చాడు. కానీ, కొన్ని రోజుల్లోనే తిరిగి జట్టుతో కలిశాడు. ఆ త‌ర్వాత‌ కెన్యాతో జరిగిన మ్యాచ్‌లో తీవ్ర దుఃఖాన్ని దిగమింగుకుని బరిలోకి దిగిన ఆయన, అద్భుతమైన సెంచరీ సాధించాడు. ఆ శతకాన్ని తన తండ్రికి అంకితమిస్తూ ఆకాశం వైపు చూసిన దృశ్యం క్రికెట్ అభిమానులను కంటతడి పెట్టించింది. కుటుంబానికి, దేశానికి ఆయన ఇచ్చిన ప్రాధాన్యతకు, ఆయన మానసిక స్థైర్యానికి ఈ సంఘటన నిలువుటద్దం.

2. 100వ అంతర్జాతీయ సెంచరీ (2012)
క్రికెట్ చరిత్రలోనే అసాధారణమైన ఘనత, 100 అంతర్జాతీయ సెంచరీల మైలురాయిని సచిన్ 2012 ఆసియా కప్‌లో బంగ్లాదేశ్‌పై అందుకున్నాడు. ఈ రికార్డు కోసం దేశమంతా ఎదురుచూడటంతో మీడియా సృష్టించిన తీవ్ర ఒత్తిడి తనను మానసికంగా అలసిపోయేలా చేసిందని సచిన్ తర్వాత స్వయంగా వెల్లడించాడు. ఈ చారిత్రాత్మక ఘనత ఆయన నిలకడకు, గొప్పతనానికి ప్రతీకగా నిలిచిపోయింది.

3. ప్రపంచకప్ విజయం (2011)
రెండు దశాబ్దాలకు పైగా దేశ ప్రజల ఆశలను తన భుజాలపై మోసిన సచిన్‌కు 2011 ప్రపంచకప్ విజయం కెరీర్‌లోనే అత్యున్నత శిఖరం. ఫైనల్లో భారత్ గెలిచిన వెంటనే ఆనందభాష్పాలతో ఉప్పొంగిపోయాడు. తన జీవితంలో ఇదే అత్యంత గర్వకారణమైన క్షణమని ప్రకటించాడు. సహచర ఆటగాళ్లు ఆయన్ను భుజాలపై ఎత్తుకుని మైదానమంతా తిప్పడం, ఆయన చిరకాల స్వప్నం నెరవేరిన తీరుకు నిదర్శనం.

4. ప్రపంచకప్ ఫైనల్ ఓటమి (2003)
గెలుపు ఎంత ఆనందాన్ని ఇస్తుందో, ఓటమి అంతే వేదనను మిగులుస్తుంది. 2003 ప్రపంచకప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి సచిన్ కెరీర్‌లో అత్యంత బాధాకరమైన క్షణాల్లో ఒకటి. టోర్నమెంట్ అంతటా అద్భుతంగా రాణించినప్పటికీ, ఫైనల్లో సచిన్ త్వరగా ఔట్ కావడం జట్టు ఓటమికి దారితీసింది. ఆ ఓటమి ఆయనను తీవ్ర నిరాశకు గురిచేసింది.

5. వీడ్కోలు టెస్ట్ (2013)
24 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌కు ముగింపు పలుకుతూ 2013లో వెస్టిండీస్‌తో వాంఖడే స్టేడియంలో తన చివరి టెస్ట్ ఆడాడు. ఈ మ్యాచ్‌లో ఆయన 74 పరుగులు చేసి తనదైన క్లాస్ టచ్‌తో అభిమానులను అలరించాడు. స్టేడియం మొత్తం 'సచిన్.. సచిన్..' అనే నినాదాలతో మార్మోగింది. మ్యాచ్ అనంతరం ఆయన చేసిన వీడ్కోలు ప్రసంగం కోట్లాది మంది అభిమానులను భావోద్వేగానికి గురిచేసింది. ఓ లెజెండరీ శకానికి అది ముగింపు.