తోటి క్రీడాకారులు ఖరీదైన కిట్లతో శిక్షణ తీసుకుంటుంటే ఆమె మాత్రం అరువు తెచ్చుకున్న సామాగ్రితో సాధన చేస్తోంది. కనీసం ఒక మంచి హాకీ స్టిక్ కూడా కొనలేని నిరుపేద కుటుంబం ఆమెది. కానీ, 15 ఏళ్ల నౌషీన్ నాజ్ ఇప్పుడు భారత మహిళల హాకీ భవిష్యత్ ఆశాకిరణంగా వెలుగొందుతోంది. మధ్యప్రదేశ్‌కు చెందిన ఈ యువ క్రీడాకారిణి, త్వరలో జపాన్‌లో జరగనున్న అండర్-18 ఆసియా కప్ జట్టులో స్థానం సంపాదించేందుకు అడుగు దూరంలో నిలిచింది.

నౌషీన్ తండ్రి అహ్ఫాజ్ ఖాన్ రోజుకు కేవలం రూ.250 సంపాదించే ఒక దినసరి కూలీ. భోపాల్‌కు 380 కిలోమీటర్ల దూరంలోని సియోని పట్టణంలో కనీసం పైకప్పు కూడా లేని ఓ అద్దె ఇంట్లో వారి నివాసం. నాలుగేళ్ల క్రితం పాత, విరిగిన హాకీ స్టిక్‌తో నౌషీన్ ప్రస్థానం మొదలైంది. "అది విరిగిపోయిన ప్రతీసారి గుడ్డతో కట్టుకుని ఆడేది తప్ప ఏరోజూ ఫిర్యాదు చేయలేదు" అని ఆమె తండ్రి గతాన్ని గుర్తుచేసుకున్నారు.

2023లో మధ్యప్రదేశ్ హాకీ అకాడమీ కంటపడటంతో ఆమె జీవితం మలుపు తిరిగింది. శిక్షణ, పౌష్టికాహారం, క్రీడా సామాగ్రి అన్నీ అకాడమీయే సమకూర్చింది. ఈ నెలలో బిహార్‌లోని రాజ్‌గిర్‌లో జరిగిన 16వ సబ్-జూనియర్ జాతీయ ఛాంపియన్‌షిప్‌లో నౌషీన్ సత్తా చాటింది. ఏకంగా 9 గోల్స్ చేసి టాప్ స్కోరర్‌గా నిలవడమే కాకుండా, 'ప్లేయర్ ఆఫ్ ది ఫైనల్' అవార్డును కూడా గెలుచుకుంది.

ఆట కోసం కూతురు వేసుకునే దుస్తులపై కొందరు విమర్శలు చేసినా, ఆమె తండ్రి అండగా నిలుస్తున్నారు. "నా కూతురిని ఎవరైనా ఆపాలని చూస్తే, ముందు నాతో తలపడాలి" అని ఆయన ధైర్యంగా చెబుతున్నారు. ఏడుగురు సంతానంలో ఒకరైన నౌషీన్ స్ఫూర్తితో ఆమె చెల్లెలు సబారికా కూడా అకాడమీలో చేరింది. "దేశం కోసం ఆడటమే నా ఏకైక లక్ష్యం" అని నౌషీన్ తన ఆశయాన్ని స్పష్టం చేసింది.