ఐపీఎల్ 2026 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్ సంజూ శాంసన్ అద్భుత ఫామ్ కొనసాగిస్తున్నాడు. ఇటీవల ఢిల్లీ క్యాపిటల్స్‌పై సెంచరీతో మెరిసిన శాంసన్, తాజాగా ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో మరో అజేయ శతకం బాదాడు. వాంఖడే స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో శాంసన్ (101 నాటౌట్: 54 బంతుల్లో, 10 ఫోర్లు, 6 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగడంతో, చెన్నై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 207 పరుగుల భారీ స్కోరు సాధించింది.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా బౌలింగ్ ఎంచుకున్నాడు. చెన్నై ఇన్నింగ్స్‌ను రుతురాజ్ గైక్వాడ్ (22) వేగంగా ఆరంభించినా, ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయాడు. ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లు స్వల్ప స్కోర్లకే వెనుదిరిగినా, సంజూ శాంసన్ మాత్రం ఒక వైపు క్రీజులో పాతుకుపోయి ముంబై బౌలర్లపై విరుచుకుపడ్డాడు. తనదైన శైలిలో బౌండరీలు, సిక్సర్లతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. అతనికి డివాల్డ్ బ్రెవిస్ (21), జేమీ ఓవర్టన్ (15) నుంచి కొంత సహకారం లభించింది.

ముంబై బౌలర్లలో ఏఎం గజన్‌ఫర్, అశ్విని కుమార్ చెరో రెండు వికెట్లు తీయగా, జస్ప్రీత్ బుమ్రా ఒక వికెట్ పడగొట్టాడు. కెప్టెన్ హార్దిక్ పాండ్యా రెండు ఓవర్లలోనే 38 పరుగులు సమర్పించుకున్నాడు. ముంబై ఇండియన్స్ విజయానికి 208 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించాల్సి ఉంది.