"ట్రంప్, షటప్".. అంటూ ఏఐ వీడియోను పోస్ట్ చేసిన హైదరాబాద్ ఇరాన్ కాన్సులేట్

Donald Trump Mocked in AI Video by Hyderabad Iran Consulate
  • ఇరాన్‌లో ట్రంప్ ఏఐ వీడియో వైరల్ అవుతోందంటూ వీడియో పోస్ట్ చేసిన కాన్సులేట్
  • ఇరాన్ బృందంతో చర్చలకు ట్రంప్ బృందం 2,000 సంవత్సరాలు నిరీక్షించినట్లు వ్యంగ్య వీడియో
  • పాక్ అభ్యర్థన మేరకు కాల్పుల విరమణను పొడిగిస్తున్నానని ట్రంప్ ప్రకటిస్తున్నట్లు వీడియో
అమెరికా, ఇరాన్ దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందంపై చర్చలు కొలిక్కి రావడంలేదు. ఇరాన్‌తో చర్చలు జరుపుతామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పలుమార్లు ప్రకటించారు. కానీ తమ డిమాండ్లకు అంగీకరిస్తేనే చర్చలు జరుపుతామని ఇరాన్ ఖరాఖండీగా చెబుతోంది. ఇరాన్‌కు ట్రంప్ బెదిరింపులు, ఆ తర్వాత చర్చలు అని చెప్పడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

ఒకవిధంగా చర్చలకు అమెరికా మొగ్గు చూపుతున్నప్పటికీ, ఇరాన్ ఆసక్తిగా లేదని ఆ దేశ ప్రకటనలను బట్టి తెలుస్తోంది. తమ డిమాండ్లకు అంగీకరించాలని తేల్చి చెబుతోంది. ఈ క్రమంలో హైదరాబాద్‌లోని ఇరాన్ కాన్సులేట్ ట్రంప్‌ను ఎద్దేవా చేస్తూ ఒక కృత్రిమ మేధ (ఏఐ) వీడియోను 'ఎక్స్' వేదికగా పోస్టు చేసింది. ట్రంప్ 2 వేల సంవత్సరాల పాటు కాల్పుల విరమణను పలుమార్లు పొడిగిస్తూ వచ్చినా ఇరాన్ చర్చలకు రాలేదని అర్థం వచ్చేలా వీడియో ఉంటుంది.

"కాల్పుల విరమణను ఎలా (ట్రంప్) పొడిగించారు? ఈ వీడియో ఇరాన్‌లో వైరల్ అవుతోంది" అని పేర్కొంటూ 45 సెకన్ల వీడియోను ఇరాన్ కాన్సులేట్, హైదరాబాద్ పోస్టు చేసింది. ఇది ఏఐ వీడియో. 

ఈ వీడియోలో చర్చల కోసం వేదికను ఏర్పాటు చేసినట్లుగా ఉంది. ఇందులో డొనాల్డ్ ట్రంప్, అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఇతర అమెరికా ప్రతినిధులు  ఒకవైపు కూర్చుని, చర్చల కోసం ఇరాన్ ప్రతినిధుల బృందం కోసం వేచి చూస్తుంటారు.

ఈ సందర్భంగా, మేం ఇరాన్‌తో చర్చలను ఫలప్రదమయ్యే విధంగా జరుపుతున్నామని ట్రంప్ తన 'ట్రూత్' సోషల్ మీడియా వేదికగా టైప్ చేస్తున్నట్లు ఈ 'ఏఐ' వీడియోను రూపొందించారు.

ఆ తర్వాత, ఇరాన్ రాకపోవడంతో ట్రంప్ నిరాశ చెంది, ఇరాన్ చర్చలకు రాకుంటే బాంబులు వేస్తామని వీడియోలో హెచ్చరిస్తారు. ఆ తర్వాత 2,000 సంవత్సరాల తర్వాత కూడా చర్చలకు ఇరాన్ బృందం రాక కోసం ట్రంప్ వేచి చూస్తున్నట్లుగా ఉంటుంది. "ఇరానియన్లు ఎక్కడ ఉన్నారు" అని ట్రంప్ గట్టిగా అరుస్తారు. కాసేపటికి ఒక సహాయకుడు వచ్చి ఒక చీటిని అందిస్తారు. అందులో "ట్రంప్, షటప్" అని రాసి ఉంటుంది. "సరే అయితే, పాకిస్తాన్ అభ్యర్థన మేరకు నేను కాల్పుల విరమణను పొడిగిస్తాను" అని ట్రంప్ వ్యాఖ్యానిస్తున్నట్లుగా ఇరాన్ కాన్సులేట్ 'ఏఐ' వ్యంగ్య వీడియోను పోస్టు చేసింది.
Go Back to Shorts
Donald Trump
Iran
Hyderabad Iran Consulate
US Iran Relations
Ceasefire Agreement
AI Video

More Telugu News