కస్టమర్ దెబ్బకు దిగొచ్చిన బ్యాంక్.. ఆ త‌ప్పు చేసినందుకు రూ.3.21 లక్షల పరిహారం!

  • క్రెడిట్ కార్డులు క్లోజ్ చేయనందుకు కోటక్ బ్యాంక్‌పై కస్టమర్ ఫిర్యాదు
  • వినియోగదారుడికి రూ.3.21 లక్షల పరిహారం చెల్లించిన బ్యాంక్
  • కార్డు మూసివేతలో జాప్యానికి ఆర్బీఐ నిబంధనల ప్రకారం జరిమానా
  • బాధితుడి అనుభవం సోషల్ మీడియాలో వైరల్.. నెటిజన్ల ప్రశంసలు
ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంకు అయిన కోటక్ మహీంద్రా బ్యాంక్ నుంచి ఓ క్రెడిట్ కార్డు వినియోగదారుడు ఏకంగా రూ.3.21 లక్షల పరిహారం పొందారు. తాను పంపిన అభ్యర్థనలను సకాలంలో ప్రాసెస్ చేయకుండా, కార్డును క్లోజ్ చేయడంలో బ్యాంకు తీవ్ర నిర్లక్ష్యం వహించడమే ఇందుకు కారణం. తనకు ఎదురైన అనుభవాన్ని, పరిహారం పొందిన విధానాన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ రెడిట్ లో పంచుకోవడంతో ఈ సంఘటన ప్రస్తుతం వైరల్‌గా మారింది.

అస‌లేం జ‌రిగిందంటే..! 
ఓ వినియోగదారుడు తన వద్ద ఉన్న రెండు కోటక్ మహీంద్రా క్రెడిట్ కార్డులను క్లోజ్ చేయాలని 2025 మే నెలలో ఈమెయిల్ ద్వారా బ్యాంకును కోరారు. రూ.1 లక్షగా ఉన్న తన క్రెడిట్ లిమిట్‌ను బ్యాంకు అకస్మాత్తుగా రూ.10,000కు తగ్గించడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈమెయిల్‌కు స్పందన రాకపోవడంతో మరో రెండుసార్లు రిమైండర్లు పంపినా ప్రయోజనం లేకపోయింది.

దాదాపు ఏడాది తర్వాత 2026 ఏప్రిల్‌లో తన ఖాతాలను పరిశీలిస్తున్నప్పుడు, వార్షిక రుసుము కింద రూ.1,180 ఛార్జ్ చేసినట్లు గుర్తించారు. దీనిపై బ్యాంకును ప్రశ్నించగా, కార్డులు రద్దు కాలేదని సమాధానం వచ్చింది. బ్యాంకు వైఖరితో విసిగిపోయిన ఆ వినియోగదారుడు, నేరుగా బ్యాంకింగ్ అంబుడ్స్‌మన్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో బ్యాంకు నోడల్ అధికారి రంగంలోకి దిగి, "ఈమెయిల్ ద్వారా కార్డు క్లోజర్ అభ్యర్థనలు స్వీకరించబడవు, మీరు కాల్ చేయాల్సింది" అంటూ మొదట కస్టమర్ తప్పేనని వాదించారు. అయితే, తాను రాతపూర్వక అభ్యర్థన ఇచ్చానని, దానికి ఆధారాలున్నాయని బాధితుడు స్పష్టం చేశారు.

అంబుడ్స్‌మన్‌కు ఫిర్యాదు చేయడంతో కేసు బ్యాంకుకు ప్రతికూలంగా మారింది. కొన్ని రోజుల తర్వాత పరిహారంగా తన బ్యాంకు ఖాతాలో రూ.3,21,000 జమ అయినట్లు వినియోగదారుడు రెడిట్ పోస్ట్‌లో పేర్కొన్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) మార్గదర్శకాల ప్రకారం కార్డు మూసివేతలో జాప్యం జరిగితే రోజుకు రూ.500 చొప్పున పరిహారం చెల్లించాలి. తన విషయంలో రెండు కార్డులు కావడంతో రోజుకు రూ.1,000 చొప్పున 321 రోజుల జాప్యానికి గాను రూ.3,21,000 పరిహారం లభించిందని ఆయన వివరించారు. ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు, సరైన మార్గంలో పోరాడి విజయం సాధించినందుకు ఆయన్ను అభినందిస్తున్నారు.

Credit Card
Kotak Mahindra Bank
Customer Grievance
Banking Ombudsman
RBI Guidelines
Credit Card Closure
Consumer Rights
Financial Compensation
Bank Negligence
Kotak Bank

More Telugu News