వెయిట్ లాస్ డ్రగ్స్ తో బరువుతో పాటు కండరాలు మాయం.. అధ్యయనంలో కీలక విషయాలు

  • సెమగ్లూటైడ్ వంటి బరువు తగ్గించే మందులతో కండరాల నష్టం అధికంగా ఉంటోందన్న‌ అధ్యయనం
  • తగ్గిన మొత్తం బరువులో కండరాల వాటా 35% వరకు ఉంటోందని పరిశోధనలో వెల్లడి
  • కండరాల నష్టం వల్ల జీవక్రియ మందగించడం, నీరసం వంటి సమస్యలు 
  • దీన్ని నివారించడానికి అధిక ప్రొటీన్ ఆహారం, రెసిస్టెన్స్ ట్రైనింగ్ అవసరమని నిపుణుల సూచన
ఊబకాయం, టైప్ 2 డయాబెటిస్ నియంత్రణలో అద్భుతంగా పనిచేస్తున్నాయంటూ ప్రాచుర్యం పొందిన సెమగ్లూటైడ్, టిర్జెపటైడ్ వంటి ఇంక్రెటిన్ ఆధారిత మందులతో ఊహించని ముప్పు పొంచి ఉందని తాజా అధ్యయనం స్ప‌ష్టం చేసింది. ఈ మందుల వాడకం వల్ల బరువు తగ్గడంతో పాటు కండరాల నష్టం కూడా ఊహించిన దానికంటే చాలా అధికంగా జరుగుతున్నట్టు యూనివర్సిటీ ఆఫ్ నార్త్ కరోలినా (యూఎన్‌సీ) స్కూల్ ఆఫ్ మెడిసిన్ పరిశోధకులు గుర్తించారు. ఈ సంచలన అధ్యయన వివరాలు ప్రఖ్యాత 'అనల్స్ ఆఫ్ ఇంటర్నల్ మెడిసిన్' జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.

యూఎన్‌సీ స్కూల్ ఆఫ్ మెడిసిన్, గిల్లింగ్స్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్‌లో ఊబకాయం, పోషకాహార నిపుణుడైన డాక్టర్ జాన్ ఎ. బాట్సిస్ నేతృత్వంలో ఈ పరిశోధన జరిగింది. ఇంక్రెటిన్ మందులకు సంబంధించి గతంలో జరిగిన 19 అధ్యయనాల సమాచారాన్ని విశ్లేషించి వారు ఈ నిర్ధారణకు వచ్చారు. ఈ మందులు వాడిన వారిలో తగ్గిన మొత్తం బరువులో కండర సంబంధిత కణజాలం వాటా ఏకంగా 35% వరకు ఉంటోంది. ఇది సురక్షితమైన పరిమితులను మించిపోయిందని పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేశారు. సాధారణంగా ఆహార నియంత్రణ వంటి పద్ధతుల ద్వారా బరువు తగ్గినప్పుడు కండరాల నష్టం 2-10% మధ్య ఉంటే, ఈ మందుల వల్ల అది చాలా ఎక్కువగా నమోదవుతోంది.

కండరాల నష్టం ఎందుకు జరుగుతుంది?.. పరిణామాలేంటి?
ఈ మందులు ఆకలిని నియంత్రించడం ద్వారా బరువు తగ్గడానికి సహాయపడతాయి. అయితే, దీనివల్ల కేలరీల వినియోగం 16-39% వరకు గణనీయంగా పడిపోతుంది. శరీరానికి శక్తి కోసం కేలరీలు అందని పక్షంలో అది కొవ్వుతో పాటు కండరాల ప్రోటీన్‌ను కూడా విచ్ఛిన్నం చేయడం ప్రారంభిస్తుంది. ముఖ్యంగా వృద్ధుల్లో ఈ పరిస్థితి మరింత ప్రమాదకరం. కండరాలు బలహీనపడటం వల్ల వారు తేలికగా కిందపడిపోవడం, తీవ్ర గాయాలపాలు కావడం వంటివి జరగవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

"బరువు తగ్గే క్రమంలో కండరాలు కొంతమేర తగ్గడం సహజమే. కానీ, మా అధ్యయనాల్లో ఊహించిన దానికంటే చాలా అధిక స్థాయిలో కండరాల నష్టం జరుగుతున్నట్టు గుర్తించాం. మొత్తం బరువు తగ్గుదలలో కండరాల నష్టం నిష్పత్తిపై మరింత దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని ఈ ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి" అని డాక్టర్ బాట్సిస్ వివరించారు.

కండరాల నష్టం వల్ల పలు రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. విశ్రాంతి సమయంలో కూడా కేలరీలను ఖర్చు చేసే కండరాలు తగ్గడంతో జీవక్రియ రేటు మందగిస్తుంది. ఫలితంగా మళ్లీ బరువు పెరిగే ప్రమాదం ఎక్కువ. అంతేగాక‌ నీరసం, బలహీనత పెరిగి రోజువారీ పనులు చేసుకోవడం కూడా కష్టంగా మారుతుంది. కండరాలు బలహీనపడటంతో శరీరానికి స్థిరత్వం తగ్గి గాయాలయ్యే ప్రమాదం పెరుగుతుంది.

నివారణకు మార్గాలు
రెసిస్టెన్స్ ట్రైనింగ్: బరువులు ఎత్తడం, పుషప్స్, స్క్వాట్స్ వంటి వ్యాయామాలను వారానికి కనీసం రెండుసార్లు చేయడం వల్ల కండరాలను కాపాడుకోవచ్చు.
అధిక ప్రొటీన్ ఆహారం: ఆహారంలో ప్రొటీన్ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. చికెన్, గుడ్లు, చేపలు, పప్పు ధాన్యాలు, పనీర్ వంటి వాటిని భోజనంలో భాగం చేసుకోవాలి. శరీర బరువులో ప్రతి కిలోగ్రాముకు 1.2-1.6 గ్రాముల ప్రొటీన్ తీసుకోవడం లక్ష్యంగా పెట్టుకోవాలి.
చురుకైన జీవనశైలి: రోజూ వాకింగ్, సైక్లింగ్ వంటి ఏరోబిక్ వ్యాయామాలతో పాటు యోగా వంటివి చేయడం వల్ల కండరాల పనితీరు మెరుగుపడుతుంది.
పోషకాహారం: విటమిన్లు, యాంటీ-ఆక్సిడెంట్లు అధికంగా ఉండే పండ్లు, కూరగాయలు తీసుకోవడం ద్వారా కండరాల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

ఈ మందులు వాడేవారు బరువు తగ్గడంతో పాటు కండరాల ఆరోగ్యంపై కూడా దృష్టి పెట్టాలని, అవసరమైతే వైద్యులు, పోషకాహార నిపుణుల సలహాలు తీసుకోవాలని ఈ అధ్యయనం నొక్కి చెబుతోంది.

More Telugu News