తెరిచినట్టా.. మూసినట్టా.. హర్మూజ్ వద్ద గందరగోళం.. కదలని నౌకలు!

Iran Announces Opening of Hormuz Strait Amidst Tensions
  • జలసంధి తెరిచినా కొనసాగుతున్న ఉద్రిక్తతలు
  • ఇరాన్ తనిఖీలు, అమెరికా పహారాతో నెలకొన్న గందరగోళం
  • మార్గంలో ముందుకు కదలని వందలాది చమురు ట్యాంకర్లు
  • బీమా కంపెనీల వెనకడుగుతో షిప్పింగ్ సంస్థల ఆందోళన
ప్రపంచ ఇంధన రవాణాకు జీవనాడిగా భావించే హర్మూజ్ జలసంధి వద్ద తీవ్ర ఉద్రిక్తత, గందరగోళం నెలకొన్నాయి. ఇజ్రాయెల్, లెబనాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంతో హర్మూజ్ జలసంధిని తెరుస్తున్నట్లు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ శుక్రవారం ప్రకటించారు. లెబనాన్ లో కాల్పుల విరమణ అమలులో ఉన్నంత కాలం హర్మూజ్ తెరిచే ఉంటుందని, అన్ని దేశాల నౌకలు రాకపోకలు సాగించవచ్చని చెప్పారు. అయితే, ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కోర్ (ఐఆర్ జీసీ) నిర్దేశించిన మార్గంలోనే నౌకలు రాకపోకలు సాగించాల్సి ఉంటుందని అరాఘ్చీ షరతు విధించారు. 

హర్మూజ్ తెరిచామంటూ ఇరాన్ మంత్రి చేసిన ప్రకటనను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వాగతించారు. ఇందుకు ఇరాన్ కు ఆయన థ్యాంక్స్ కూడా చెప్పారు. అయితే, హర్మూజ్ జలసంధిపై అమెరికా నేవీ కొనసాగిస్తున్న బ్లాకేడ్ అలాగే ఉంటుందని చెప్పారు. నౌకల రాకపోకలపై తమ పర్యవేక్షణ కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఇదిలావుంచితే, హర్మూజ్ తెరిచామని ఇరాన్, అమెరికా ప్రకటించినా క్షేత్రస్థాయిలో పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. కఠిన నిబంధనలు, ఇరు దేశాల మధ్య అపనమ్మకం కారణంగా వందలాది చమురు, సరకు రవాణా నౌకలు సముద్రంలోనే నిలిచిపోయాయి.

కొన్ని రోజుల క్రితం ఇరాన్ ఈ జలసంధిని మూసివేయడంతో అంతర్జాతీయ ఒత్తిడి పెరిగింది. చర్చల అనంతరం మార్గాన్ని పునఃప్రారంభించేందుకు ఇరాన్ అంగీకరించింది. అయితే, ఈ మార్గంలో ప్రయాణించే ప్రతి నౌకను తమ రివల్యూషనరీ గార్డ్స్ (ఐఆర్ జీసీ) క్షుణ్ణంగా తనిఖీ చేస్తామని షరతు విధించింది. ఈ తనిఖీల పేరుతో జరుగుతున్న జాప్యం, కఠిన వైఖరి నౌకాయాన సంస్థలను ఆందోళనకు గురిచేస్తోంది.

మరోవైపు, అమెరికా తన మిత్రదేశాల నౌకలకు రక్షణగా యుద్ధ నౌకలను రంగంలోకి దించింది. ఇరాన్ నిబంధనలను అమెరికా వ్యతిరేకిస్తుండటంతో ఇరు పక్షాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. దీనికి తోడు, ఈ మార్గంలో ప్రయాణించే నౌకలకు బీమా కవరేజీ ఇచ్చేందుకు కంపెనీలు వెనుకాడుతున్నాయి. కొన్ని సంస్థలు ప్రీమియంలను భారీగా పెంచడంతో ఓడల యజమానులు ముందుకు సాగేందుకు సాహసించడం లేదు.

‘మార్గం తెరిచామని ఇరాన్ చెబుతున్నా, క్షేత్రస్థాయిలో యుద్ధ వాతావరణం ఉంది. చిన్న పొరపాటు జరిగినా పరిస్థితి చేయి దాటిపోతుంది’ అని ఓ ప్రముఖ షిప్పింగ్ ఏజెంట్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచ చమురు రవాణాలో 20% వాటా ఉన్న ఈ జలసంధి వద్ద ప్రతిష్టంభన కొనసాగితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడే ప్రమాదం ఉంది.
Go Back to Shorts
Hormuz Strait
Iran
Donald Trump
oil tankers
shipping
Persian Gulf
US Navy
Abbas Araghchi
Islamic Revolutionary Guard Corps
IRGC

More Telugu News