మోసపూరిత ఖాతాల అంశం... అనిల్ అంబానీకి సుప్రీంకోర్టులో చుక్కెదురు

  • రిలయన్స్ కమ్యూనికేషన్స్‌ రుణ ఖాతాలను మోసపూరిత ఖాతాలుగా ప్రకటించిన బ్యాంకులు
  • మోసపూరిత ఖాతాల విషయంలో చర్యలకు అనుమతించిన బాంబే హైకోర్టు
  • సుప్రీంకోర్టులో సవాల్ చేసిన అనిల్ అంబానీ
రిలయన్స్ కమ్యూనికేషన్స్ గ్రూప్ కంపెనీల రుణ ఖాతాలను మోసపూరితమైనవిగా పేర్కొనడాన్ని సవాల్ చేస్తూ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. రిలయన్స్ కమ్యూనికేషన్స్‌కు చెందిన మోసపూరిత ఖాతాల విషయంలో చర్యలకు బాంబే హైకోర్టు అనుమతించడాన్ని ఆయన సవాల్ చేయగా, సుప్రీంకోర్టులో చుక్కెదురైంది.

ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం తన నిర్ణయాన్ని ప్రకటించింది. అయితే బ్యాంకులిచ్చిన షోకాజ్ నోటీసులపై హైకోర్టు సింగిల్ జడ్జి బెంచ్ వద్ద తన వాదనలు వినిపించుకోవడానికి అనిల్ అంబానీకి అనుమతిచ్చింది. ఈ ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని హైకోర్టుకు సూచించింది.

బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు, ఐడీబీఐ బ్యాంకులు రిలయన్స్ ఇండస్ట్రీస్‌ ఖాతాలను మోసపూరితమైనవిగా ప్రకటించాయి. బ్యాంకులు చేసిన ప్రకటనపై అనిల్ అంబానీ బాంబే హైకోర్టులో సవాల్ చేశారు. విచారించిన హైకోర్టు సింగిల్ బెంచ్, వాటిపై స్టే విధించడంతో పాటు భవిష్యత్తులో చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇచ్చింది. మోసపూరిత ఖాతాలుగా గుర్తించే విషయంలో ఆర్బీఐ మార్గదర్శకాలు పాటించలేదని పేర్కొంది.

దీనితో మూడు బ్యాంకులు అప్పీలుకు వెళ్లాయి. విచారించిన హైకోర్టు డివిజన్ బెంచ్, సింగిల్ బెంచ్ ఉత్తర్వులను కొట్టివేసింది. ఈ క్రమంలో అనిల్ అంబానీ డివిజన్ బెంచ్ తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేయగా, చుక్కెదురైంది.

Anil Ambani
Reliance Communications
Supreme Court
loan accounts
fraudulent accounts
Bombay High Court

More Telugu News