పాస్ చేయండి సార్.. ఇంటర్ బోర్డుకు విద్యార్థి ఫోన్.. కౌన్సెలింగ్ ఇచ్చిన అధికారులు

  • ఫెయిల్ అవుతాననే భయంతో బోర్డుకు ఫోన్ చేసిన విద్యార్థి
  • పాస్ చేయాలని, జవాబు పత్రాల్లో డబ్బులు పెట్టానని వెల్లడి
  • విద్యార్థికి ఫోన్‌లోనే కౌన్సెలింగ్ ఇచ్చి ధైర్యం చెప్పిన అధికారులు
  • ఫలితాల్లో మొత్తం ఐదు సబ్జెక్టుల్లో ఫెయిలైన విద్యార్థి
  • తల్లిదండ్రులతో మాట్లాడి జాగ్రత్తలు చెప్పిన జిల్లా యంత్రాంగం
ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఫెయిలవుతాననే భయం ఓ విద్యార్థితో వింత పని చేయించింది. ఫలితాలు వెలువడక ముందే ఏకంగా ఇంటర్ బోర్డు అధికారులకే ఫోన్ చేసి, తనను ఎలాగైనా పాస్ చేయాలంటూ వేడుకున్నాడు. ఈ ఘటన విశాఖపట్నంలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే, విశాఖకు చెందిన ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థి ఒకరు బుధవారం ఫలితాలకు ముందు బోర్డు అధికారులకు ఫోన్ చేశాడు. పరీక్షల్లో ఏమీ చదవలేదని, జవాబు పత్రంలో ప్రశ్నాపత్రాన్నే మూడుసార్లు రాశానని ఆవేదన వ్యక్తం చేశాడు. అంతేకాకుండా, పాస్ చేయాలనే ఉద్దేశంతో జవాబు పత్రాల్లో డబ్బులు కూడా పెట్టానని అధికారులకు చెప్పాడు.

అతని ఆందోళనను అర్థం చేసుకున్న అధికారులు వెంటనే స్పందించి, ఫోన్‌లోనే కౌన్సెలింగ్ ఇచ్చారు. కంగారు పడాల్సిన అవసరం లేదని, త్వరలో అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఉంటాయని, వాటి కోసం బాగా చదువుకోవాలని సూచించారు. అనంతరం ఈ విషయాన్ని విశాఖపట్నం ఆర్‌ఐఓ (రీజనల్ ఇన్‌స్పెక్టింగ్ ఆఫీసర్) దృష్టికి తీసుకెళ్లి, విద్యార్థి తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వాలని కోరారు.

జిల్లా అధికారులు రంగంలోకి దిగి విద్యార్థి తల్లిదండ్రులతో మాట్లాడారు. కాగా, వెలువడిన ఫలితాల్లో ఆ విద్యార్థి మొదటి సంవత్సరంలో రెండు, ద్వితీయ సంవత్సరంలో మూడు సబ్జెక్టుల్లో ఫెయిల్ అయ్యాడు. విద్యార్థి ఇంట్లోనే సురక్షితంగా ఉన్నాడని, తాము జాగ్రత్తగా చూసుకుంటామని అతని తల్లిదండ్రులు అధికారులకు హామీ ఇచ్చారు.

Inter Board
Inter Board Exams
Intermediate Exams
Vizag Student
Andhra Pradesh Education
AP Inter Results
Exam Counselling
Advanced Supplementary Exams
Visakhapatnam
Education

More Telugu News