పిఠాపురానికి 'సెలక్షన్ గ్రేడ్' హోదా.. పవన్ చొరవతో కీలక నిర్ణయం

Pawan Kalyan Pithapuram Municipality Gets Selection Grade Status
  • సెకండ్ గ్రేడ్ నుంచి అప్‌గ్రేడ్ చేస్తూ అధికారికంగా ఉత్తర్వుల జారీ
  • డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చొరవతో వేగంగా పూర్తయిన ప్రక్రియ
  • హోదా పెంపుతో పెరగనున్న నిధులు.. మెరుగవనున్న మౌలిక వసతులు
  • త్వరలో కమిషనర్‌గా గ్రూప్-1 స్థాయి అధికారి   నియామకం
డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పిఠాపురం మున్సిపాలిటీని సెకండ్ గ్రేడ్ నుంచి సెలక్షన్ గ్రేడ్‌కు పెంచుతూ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ హోదా పెంపుతో పట్టణ అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన మరింత వేగవంతం కానుంది.

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఈ విషయంలో ప్రత్యేక చొరవ చూపినట్లు తెలుస్తోంది. పిఠాపురం మున్సిపల్ కౌన్సిల్, ప్రత్యేక అధికారి పంపిన ప్రతిపాదనలను ప్రభుత్వం పరిశీలించింది. 2021 నుంచి 2025 వరకు మున్సిపాలిటీ ఆదాయ, వ్యయాల రికార్డులను సమీక్షించిన అనంతరం, సెలక్షన్ గ్రేడ్‌కు అర్హత ఉందని నిర్ధారించి ఈ నిర్ణయం తీసుకుంది. సాధారణంగా రూ.8 కోట్లకు పైగా వార్షిక ఆదాయం ఉన్న మున్సిపాలిటీలకు సెలక్షన్ గ్రేడ్ హోదా కల్పిస్తారు.

ఈ హోదా పెంపుతో పిఠాపురం అభివృద్ధికి మరిన్ని అవకాశాలు లభించనున్నాయి. ఇకపై గ్రూప్-1 స్థాయి అధికారి కమిషనర్‌గా బాధ్యతలు చేపడతారు. మున్సిపాలిటీలో ఉద్యోగుల సంఖ్య పెరగడంతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ప్రత్యేక నిధులు భారీగా అందనున్నాయి. తద్వారా పట్టణంలో మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధి పనులు వేగవంతం కానున్నాయి.

1957లో మున్సిపాలిటీగా ఏర్పడిన పిఠాపురం, ఆధ్యాత్మికంగా ఎంతో ప్రసిద్ధి చెందింది. ఇక్కడి పాదగయ క్షేత్రం, కుక్కుటేశ్వరస్వామి, పురుహూతికా దేవి శక్తిపీఠం, శ్రీపాద వల్లభుల ఆలయాలకు దేశవ్యాప్తంగా భక్తులు వస్తుంటారు. పెరిగిన జనాభా, భక్తుల రద్దీతో మున్సిపాలిటీ ఆదాయం కూడా గణనీయంగా పెరిగింది.

ఇటీవల కాలంలో పిఠాపురం అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఇప్పటికే 'పిఠాపురం ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ' (పీఏడీఏ)ని ఏర్పాటు చేసింది. అలాగే కేంద్ర ప్రభుత్వం 'అమృత్ భారత్' పథకం కింద పిఠాపురం రైల్వే స్టేషన్ ఆధునికీకరణకు రూ.37.25 కోట్లు మంజూరు చేయడం గమనార్హం. ఇప్పుడు మున్సిపాలిటీ హోదా పెంపుతో అభివృద్ధి మరింత ఊపందుకోనుంది.
Go Back to Shorts
Pawan Kalyan
Pithapuram
Pithapuram Municipality
Selection Grade
Andhra Pradesh
Municipal Development
Infrastructure Development
Amrit Bharat Scheme
Pada Gaya Kshetram

More Telugu News