ఇంధన ధరలు తగ్గాలంటే కార్లు తక్కువగా వాడండి: అమెరికన్లకు షెవ్రాన్ అధికారి సలహా

Chevron executive Andy Walz advises Americans to drive less amid rising fuel prices
  • డబ్బు ఆదా చేసుకోవాలంటే ప్రజలు డ్రైవింగ్ తగ్గించుకోవాలని వ్యాఖ్య
  • హ‌ర్మూజ్ జలసంధి మూసివేతతో ప్రపంచవ్యాప్తంగా పెరిగిన ఇంధన ధరలు
  • జలసంధిని పూర్తిగా దిగ్బంధిస్తున్నట్లు ప్రకటించిన అధ్యక్షుడు ట్రంప్
  • ఈ నెల 22తో ముగియనున్న అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణ ఒప్పందం
అమెరికా-ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో హ‌ర్మూజ్ జలసంధి మూసివేతతో ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ముఖ్యంగా అమెరికాలో గ్యాస్ ధరలు రికార్డు స్థాయికి చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో ప్రముఖ చమురు సంస్థ షెవ్రాన్ ఎగ్జిక్యూటివ్ ఆండీ వాల్జ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. పెరిగిన ధరల నుంచి ఉపశమనం పొందాలంటే ప్రజలు తమ వాహనాలను తక్కువగా వాడాలని, ఇంధనాన్ని పొదుపు చేసుకోవాలని ఆయన సలహా ఇచ్చారు.

సీబీఎస్ న్యూస్‌తో మాట్లాడుతూ... "ప్రజలు డ్రైవింగ్ తగ్గించుకోవాలి. ఇంధనాన్ని పొదుపు చేసేందుకు ప్రయత్నించాలి. నిజానికి మనం ఎప్పుడూ ఇలాగే చేయాలి. ఇంధనం ప్రజల జీవితాలకు అత్యవసరం. దానిని మనం పొదుపుగా వాడుకోవాలి" అని వాల్జ్ పేర్కొన్నారు. ఆయన వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ప్రపంచ సముద్ర మార్గ చమురు, సహజవాయువు రవాణాలో దాదాపు 20 శాతం హర్మూజ్ జలసంధి ద్వారానే జరుగుతుంది. ఇరాన్ ఈ మార్గాన్ని తన అధీనంలోకి తీసుకోవడంతో గల్ఫ్ దేశాల నుంచి ముడి చమురుపై ఆధారపడిన అనేక దేశాలు తీవ్ర ఆర్థిక నష్టాన్ని ఎదుర్కొంటున్నాయి. దీని ప్రభావంతో అమెరికా సహా ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు విపరీతంగా పెరిగాయి.

ఈ అంశంపై వాల్జ్ వివరిస్తూ... "ఇది అంతర్జాతీయ మార్కెట్ సమస్య. కేవలం అమెరికన్ల కోసం ధరలను తగ్గించడానికి తక్షణమే అద్భుత పరిష్కారాలేవీ లేవు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో మరింత కఠినంగా ఉంటుంది" అని హెచ్చరించారు.

మరోవైపు ఇరాన్‌తో శాంతి చర్చలు విఫలమవడంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హ‌ర్మూజ్ జలసంధిపై సంచలన నిర్ణయం తీసుకున్నారు. "ప్రపంచంలోనే అత్యుత్తమమైన మా నౌకాదళం, హ‌ర్మూజ్ జలసంధిలోకి ప్రవేశించే లేదా బయటకు వెళ్లే అన్ని నౌకలను తక్షణమే దిగ్బంధిస్తుంది" అని ఆయన తన ట్రూత్ సోషల్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఇరాన్ వైఖరి మారే వరకు ఈ దిగ్బంధనం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. కాగా, ప్రస్తుతం అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న రెండు వారాల కాల్పుల విరమణ ఒప్పందం ఈ నెల‌ 22తో ముగియనుంది.
Go Back to Shorts
Andy Walz
Chevron
fuel prices
gas prices
Hormuz Strait
Iran
oil prices
US Iran tensions
Donald Trump
energy conservation

More Telugu News