ట్రంప్ ఆంక్షలు ముగియడానికి ముందు భారత్‌కు పెద్ద ఎత్తున ఇరాన్ చమురు

  • దాదాపు 4 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురు రాక
  • పారాదీప్‌, సిక్కాలలో చమురు అన్‌లోడింగ్
  • ఇరాన్‌పై ఆంక్షల ఎత్తివేత గడువు త్వరలో ముగింపు
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న తరుణంలో, ఇరాన్ నుంచి భారత్‌కు దాదాపు 4 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురు వచ్చింది. సుమారు ఏడేళ్ల తర్వాత ఇరాన్ నుంచి భారత్ చమురును కొనుగోలు చేస్తోంది. యుద్ధం నేపథ్యంలో ఇరాన్ చమురుపై ఉన్న ఆంక్షలను అమెరికా ఇటీవల తాత్కాలికంగా ఎత్తివేసింది. ఈ నెల 19న గడువు ముగియనుండగా, దీనిని పొడిగించేది లేదని అమెరికా స్పష్టం చేసింది.

ట్రంప్ ప్రభుత్వం ఇరాన్ చమురుపై విధించిన గడువు ఈ వారాంతంలో ముగియనున్నందున, భారత్ వ్యూహాత్మకంగా అంతకుముందే టెహ్రాన్ నుంచి చమురును దిగుమతి చేసుకుంటోంది. ఫిబ్రవరి చివరలో ప్రారంభమైన యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరాలో అంతరాయం ఏర్పడింది. ప్రపంచ ఇంధన కొరత, ధరల స్థిరీకరణ కోసం అమెరికా రష్యా, ఇరాన్ ముడి చమురు కొనుగోళ్లకు తాత్కాలికంగా అనుమతించింది.

దీనితో ఇరాన్ నుంచి భారత్ చమురును దిగుమతి చేసుకుంటోంది. ఇరాన్ చమురుతో నిండిన అతిపెద్ద ముడి చమురు రవాణా నౌక 'జయ' ఇప్పటికే భారత తూర్పు తీరంలోని పారాదీప్ వద్ద సరుకును దింపుతోంది. మరో చమురు నౌక 'ఫెలిసిటీ' పశ్చిమ తీరంలోని సిక్కాలో చమురును అన్‌లోడ్ చేస్తోంది. ఈ రెండు నౌకల్లో 2 మిలియన్ బ్యారెళ్ల చమురు చొప్పున వచ్చింది. భారతదేశం అవసరాల కోసం ఇరాన్ నుంచి ముడి చమురును సేకరిస్తామని ఈ నెల ప్రారంభంలో భారత్ తెలిపింది.

ఇదిలా ఉండగా, ఇరాన్‌లోని ఖర్గ్‌లో ముడి చమురు నింపుకున్న 'డెర్యా' నౌక భారతదేశ పశ్చిమ తీరంలో నిలిచి ఉంది. అయితే ఏ రేవుకు వెళ్లాలన్నదానిపై ఈ నౌక తదుపరి ఆదేశాల కోసం వేచి చూస్తున్నట్లు తెలుస్తోంది.

Iran Oil
India Iran
Trump
Crude Oil
Oil Import
US Sanctions
Paradip
Sikka
Derya
Felicity

More Telugu News