25వ సవరణ ట్రంప్‌ను గద్దె దించగలదా?.. తెరపైకి కీలక చర్చ!

What Is The 1967 Law For Impeachment Of US President And Why It May Not Work Against Trump
ఇరాన్, అమెరికా మధ్య శాంతి చర్చలు విఫలమై ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరిన వేళ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను పదవి నుంచి తొలగించాలనే డిమాండ్లు మళ్లీ ఊపందుకున్నాయి. ఇరాన్‌పై ట్రంప్ వాగ్దాడుల నేపథ్యంలో ఆయనను అధికారం నుంచి తప్పించేందుకు రాజ్యాంగంలోని 25వ సవరణను ప్రయోగించాలనే చర్చ మళ్లీ తెరపైకి వచ్చింది. అయితే, ఈ డిమాండ్లు వినిపిస్తున్నప్పటికీ, ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ఇది కార్యరూపం దాల్చడం దాదాపు అసాధ్యమని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.

ఏమిటీ 25వ సవరణ?
అమెరికా అధ్యక్షుడు జాన్ ఎఫ్. కెన్నెడీ హత్య తర్వాత అధ్యక్ష పదవిలో ఆకస్మికంగా ఖాళీ ఏర్పడితే నాయకత్వ కొనసాగింపునకు భరోసా కల్పించే లక్ష్యంతో 1967లో 25వ సవరణను ఆమోదించారు. అధ్యక్షుడి మరణం, రాజీనామా లేదా అనారోగ్యంతో విధులకు దూరమైనప్పుడు అధికార మార్పిడి ఎలా జరగాలో ఈ సవరణ స్పష్టంగా వివరిస్తుంది. దీనిలోని సెక్షన్ 3 ప్రకారం అధ్యక్షుడు స్వచ్ఛందంగా తన అధికారాలను తాత్కాలికంగా ఉపాధ్యక్షుడికి అప్పగించవచ్చు. గతంలో కొందరు అధ్యక్షులు వైద్య చికిత్సల సమయంలో ఈ వెసులుబాటును ఉపయోగించుకున్నారు.

వివాదాస్పదమైన సెక్షన్ 4
అయితే, ఇందులో అత్యంత కీలకమైనది, వివాదాస్పదమైనది సెక్షన్ 4. దీని ప్రకారం అధ్యక్షుడు తన విధులను నిర్వర్తించలేని స్థితిలో ఉన్నారని ఉపాధ్యక్షుడు, కేబినెట్‌లోని మెజారిటీ సభ్యులు భావించి, ఆ విషయాన్ని లిఖితపూర్వకంగా ప్రకటిస్తే, అధ్యక్షుడి అధికారాలు రద్దయి ఉపాధ్యక్షుడు తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు చేపడతారు. ప్రస్తుతం జేడీ వాన్స్ ఉపాధ్యక్షుడిగా ఉన్నారు.

ఎందుకిది అసాధ్యం?
ఈ ప్రక్రియ అంత సులభం కాదు. ఉపాధ్యక్షుడు, కేబినెట్ తనను వ్యతిరేకించినా, అధ్యక్షుడు ఆ నిర్ణయాన్ని సవాలు చేయవచ్చు. అప్పుడు ఈ అంశం కాంగ్రెస్ (పార్లమెంట్) ముందుకు వెళ్తుంది. అక్కడ ఉభయ సభల్లోనూ (ప్రతినిధుల సభ, సెనెట్) మూడింట రెండొంతుల భారీ మెజారిటీతో తొలగింపు తీర్మానం ఆమోదం పొందితేనే అధ్యక్షుడిని శాశ్వతంగా తప్పించగలరు. ప్రస్తుత రాజకీయ ప‌రిస్థితుల్లో ఇంతటి భారీ మద్దతు కూడగట్టడం దాదాపు అసాధ్యం. ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ గానీ, ట్రంప్ కేబినెట్‌లోని సభ్యులు గానీ అధ్యక్షుడిని ధిక్కరించే సూచనలు ఏమాత్రం కనిపించడం లేదు. రిపబ్లికన్ పార్టీలో ట్రంప్‌కు ఇప్పటికీ బలమైన మద్దతు ఉంది. గతంలో అభిశంసన ప్రక్రియ కూడా విఫలమైన నేపథ్యంలో 25వ సవరణ ప్రయోగం కేవలం సైద్ధాంతిక చర్చకే పరిమితమని, ఆచరణలో దీనికి ఆస్కారం లేదని స్పష్టమవుతోంది.
Go Back to Shorts
Donald Trump
Trump impeachment
25th Amendment
US politics
Iran tensions
JD Vance
Presidential removal
US Congress
Republican Party
Presidential disability

More Telugu News