ఆర్టెమిస్ నుంచి మార్స్ వరకు.. నాసాలో శిఖరాగ్రానికి భారత సంతతి వ్యక్తి.. ఎవరీ అమిత్ క్షత్రియ?

చిన్నప్పుడు టెక్సాస్‌లోని హ్యూస్టన్‌లో ఆసక్తిగా రాకెట్ ప్రయోగాలను వీక్షించడం నుంచి, నేడు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా)లో అత్యున్నత స్థాయి పౌర అధికారిగా ఎదగడం వరకు.. భారత సంతతికి చెందిన అమిత్ క్షత్రియ ప్రస్థానం ఎందరికో స్ఫూర్తిదాయకం. నాసా అసోసియేట్ అడ్మినిస్ట్రేటర్‌గా, ఆయన సంస్థకు చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌ గా వ్యవహరిస్తున్నారు. నాసాకు చెందిన 10 కేంద్రాల డైరెక్టర్లు, వాషింగ్టన్‌లోని ప్రధాన కార్యాలయంలోని మిషన్ డైరెక్టరేట్ హెడ్స్‌కు నాయకత్వం వహిస్తూ, అడ్మినిస్ట్రేటర్ జేర్డ్ ఐజాక్‌మన్‌కు సీనియర్ సలహాదారుగా సేవలు అందిస్తున్నారు. క్లుప్తంగా చెప్పాలంటే.. నాసా కార్యకలాపాలు సజావుగా సాగేలా చూసే కీలక వ్యక్తి ఆయనే.

హ్యూస్టన్ బాలుడి నుంచి ఉన్నత శిఖరాలకు
విస్కాన్సిన్‌లోని బ్రూక్‌ఫీల్డ్‌లో వలస వచ్చిన భారతీయ తల్లిదండ్రులకు జన్మించినప్పటికీ, అమిత్ క్షత్రియ టెక్సాస్‌లోని హ్యూస్టన్ శివారు ప్రాంతమైన కేటీని తన సొంత ఊరిగా భావిస్తారు. నాసాకు చెందిన మిషన్ కంట్రోల్ సెంటర్ ఉన్న ఆ నగరంలోనే ఆయనకు అంతరిక్షంపై ఆసక్తి మొదలైంది. రాకెట్ ప్రయోగాలను చూస్తూ పెరిగిన ఆయన, ఏదో ఒక రోజు వాటిలో భాగం కావాలని నిశ్చయించుకున్నారు. కాలిఫోర్నియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి గణితంలో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్, యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ నుంచి మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ పట్టాలు పొందారు.

అంచెలంచెలుగా ఎదిగిన వైనం
చదువు పూర్తయిన వెంటనే అమిత్ నాసాలో చేరలేదు. మొదట ఆయిల్ అండ్ గ్యాస్, వైద్య రంగాలలో పనిచేసిన తర్వాత 2003లో నాసా స్పేస్ షటిల్ కార్యక్రమానికి ప్రధాన కాంట్రాక్టర్‌గా ఉన్న యునైటెడ్ స్పేస్ అలయన్స్‌లో చేరారు. అక్కడ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా, రోబోటిక్స్ ఇంజనీర్‌గా, స్పేస్‌క్రాఫ్ట్ ఆపరేటర్‌గా పనిచేశారు. ముఖ్యంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్‌) రోబోటిక్ అసెంబ్లీపై దృష్టి సారించారు.

అనేక ప్రతిష్ఠాత్మక అవార్డులు అందుకుని నాసాలో అంచెలంచెలుగా ఎదిగిన వైనం
2014 నుంచి 2017 వరకు స్పేస్ స్టేషన్ ఫ్లైట్ డైరెక్టర్‌గా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న బృందాలకు మార్గనిర్దేశం చేశారు. ఆ తర్వాత ఐఎస్ఎస్‌ వెహికల్ ఆఫీస్‌కు డిప్యూటీ మేనేజర్‌గా వ్యవహరించారు. 2021లో నాసా ప్రధాన కార్యాలయంలో కీలక బాధ్యతలు చేపట్టి, ఆర్టెమిస్-I మిషన్‌లో అంతర్భాగమయ్యారు. ఈ మిషన్ దశాబ్దాల తర్వాత మానవ సామర్థ్యమున్న అంతరిక్ష నౌకను చంద్రుని కక్ష్యలోకి తిరిగి పంపింది. అనంతరం నాసా 'మూన్ టు మార్స్' కార్యక్రమానికి డిప్యూటీ అసోసియేట్ అడ్మినిస్ట్రేటర్‌గా, చంద్రునిపై మానవ నివాసానికి, భవిష్యత్ గ్రహాంతర యాత్రలకు సంబంధించిన దీర్ఘకాలిక ప్రణాళికలను రూపొందించడంలో సహాయపడ్డారు. గతేడాది సెప్టెంబర్‌లో నాసాలో అత్యున్నత పౌర సేవా పదవి అయిన అసోసియేట్ అడ్మినిస్ట్రేటర్‌గా నియమితులయ్యారు. తన కెరీర్‌లో ఆయన నాసా ఔట్‌స్టాండింగ్ లీడర్‌షిప్ మెడల్, సిల్వర్ స్నూపీ వంటి ప్రతిష్ఠాత్మక పురస్కారాలను కూడా అందుకున్నారు.

Amit Kshatriya
NASA
Artemis program
Moon to Mars
Indian American
Space exploration
Associate Administrator
Space Shuttle program
International Space Station
Houston

More Telugu News