ఇంట్లోనే 5 నెల‌లుగా కూతురి శవంతో తండ్రి.. దుర్వాసన రాకుండా పెర్ఫ్యూమ్‌లు.. మీరట్‌లో హృదయవిదారక ఘటన

Father lived with daughters body for 5 months sprayed perfume to hide smell
ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో హృదయాలను ద్రవింపజేసే అత్యంత విషాదకర ఘటన వెలుగులోకి వచ్చింది. ఐదు నెలల క్రితం చనిపోయిన కుమార్తె మృతదేహాన్ని ఇంట్లోనే ఉంచుకుని, దానితోనే కలిసి జీవిస్తున్న ఓ తండ్రి ఉదంతం స్థానికంగా పెను సంచలనం సృష్టిస్తోంది. మృతదేహం నుంచి దుర్వాసన రాకుండా ఉండేందుకు అతడు రోజూ దానిపై పెర్ఫ్యూమ్ చల్లుతూ గడిపిన తీరు అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది.

వివరాల్లోకి వెళితే.. మీరట్‌కు చెందిన ప్రియాంక బిశ్వాస్ అనే మహిళ స్థానికంగా ఉపాధ్యాయురాలిగా పనిచేసేవారు. ఆమె తన తండ్రి భాను బిశ్వాస్‌తో కలిసి నివాసం ఉంటున్నారు. అయితే, శనివారం సాయంత్రం భాను బిశ్వాస్ ఇంటికి కొందరు బంధువులు వచ్చారు. ఇంట్లోకి అడుగుపెట్టగానే వారికి తీవ్రమైన దుర్వాసన వచ్చింది. అనుమానంతో ఇంట్లోని గదులను పరిశీలించగా, ఒక గదిలోని మంచంపై పూర్తిగా కుళ్లిపోయి అస్థిపంజరంగా మారిన మృతదేహాన్ని చూసి షాక్‌కు గురయ్యారు. వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించారు.

ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు, ఇంటి గేటుకు తాళం వేసి ఉండటాన్ని గమనించారు. తాళం పగలగొట్టి లోపలికి ప్రవేశించగా, ప్రాంగణం మొత్తం చెత్తాచెదారంతో నిండి ఉంది. ఒక గదిలో మంచం మీద ప్రియాంక బిశ్వాస్ అస్థిపంజరం కనిపించింది. ఆమె చనిపోయి సుమారు ఐదు నెలలు కావొచ్చని, దీంతో శరీరం దాదాపుగా ఎముకల గూడుగా మారిపోయిందని పోలీసులు తెలిపారు. కేవలం కాళ్లు మాత్రమే గుర్తుపట్టేలా ఉందని, అవశేషాలను ఫోరెన్సిక్ పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించామని వెల్లడించారు.

ఈ కుటుంబంలో 2023లో జరిగిన ఓ విషాదం వారిని మానసికంగా కుంగదీసింది. ప్రియాంక తల్లి షర్మిష్ఠ బిస్వాస్ ఆత్మహత్య చేసుకున్నారు. ఆ సమయంలో ఉదయ్ భాను వారణాసిలో పనిచేస్తుండటంతో ఇంటికి రాలేకపోయారు. ఈ మనస్తాపంతోనే ఆమె మీరట్‌లోని ఇంట్లో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుంది. తల్లి మరణంతో ప్రియాంక తీవ్రమైన షాక్‌కు గురై ఒంటరిగా జీవించడం ప్రారంభించింది. తండ్రీకూతుళ్లిద్దరూ క్రమంగా బయటి ప్రపంచంతో సంబంధాలు తెంచుకున్నారు.

ప్రాథమిక విచారణలో తండ్రి భాను బిశ్వాస్.. కుమార్తె మరణించినా అంత్యక్రియలు చేయకుండా మృతదేహాన్ని ఇంట్లోనే ఉంచినట్లు తేలింది. వాసన రాకుండా రోజూ పెర్ఫ్యూమ్ కొట్టేవాడని తెలిసింది. అసలు ప్రియాంక ఎలా చనిపోయింది? అనారోగ్యమా లేక మరేదైనా కారణమా? కుమార్తెపై ప్రేమతో తండ్రి ఈ చర్యకు పాల్పడ్డాడా? లేక దీని వెనుక ఏదైనా నేర కోణం ఉందా? అనే విషయాలపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. భాను బిశ్వాస్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
Go Back to Shorts
Meerut
Bhanu Biswas
Priyanka Biswas
Uttar Pradesh
dead body
father
crime news
India news
perfume
skeletal remains

More Telugu News