ఓటీటీలోకి వస్తున్న 'ఉస్తాద్ భగత్ సింగ్'... స్ట్రీమింగ్ తేదీ ఖరారు
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మాస్ డైరెక్టర్ హరీశ్ శంకర్ కలయికలో రూపొందిన భారీ చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఇప్పుడు డిజిటల్ తెరపై సందడి చేసేందుకు సిద్ధమైంది. ‘గబ్బర్ సింగ్’ వంటి సంచలన విజయం తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన సినిమా కావడంతో విడుదల సమయంలో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే, బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. కానీ, పవన్ కల్యాణ్ మార్క్ మేనరిజమ్స్, యాక్షన్ సీక్వెన్స్ అభిమానులను అలరించాయి. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రంలో శ్రీలీల, రాశీ ఖన్నా కథానాయికలుగా నటించగా... దేవి శ్రీ ప్రసాద్, తమన్ సంగీతం అందించారు.
ఈ చిత్ర డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది. ఏప్రిల్ 16 నుంచి ‘ఉస్తాద్ భగత్ సింగ్’ నెట్‌ఫ్లిక్స్ వేదికగా ప్రేక్షకుల ముందుకు రానుంది. కేవలం తెలుగులోనే కాకుండా తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా ఏకకాలంలో స్ట్రీమింగ్ కానుండటం విశేషం. థియేటర్లలో ఈ సినిమాను వీక్షించే అవకాశం కోల్పోయిన పవన్ అభిమానులు, ఇప్పుడు పాన్-ఇండియా స్థాయిలో తమకు నచ్చిన భాషలో ఓటీటీలో చూసే వెసులుబాటు లభించింది. వెండితెరపై ఫలితం ఎలా ఉన్నా, డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లో మాత్రం ఉస్తాద్ తన జోరు చూపిస్తాడని సినీ వర్గాలు భావిస్తున్నాయి.