రైతు రుణమాఫీపై తప్పుడు ప్రచారం వద్దు: హరీశ్ రావు విమర్శలకు మంత్రి తుమ్మల కౌంటర్
గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన రైతు రుణమాఫీ కేవలం వడ్డీలకే సరిపోయిందని, తమ ప్రభుత్వం మాత్రం చిత్తశుద్ధితో రైతులకు లబ్ధి చేకూరుస్తోందని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో మీడియా ప్రతినిధులతో మాట్లాడిన ఆయన... రుణమాఫీ, రైతు భరోసా అంశాలపై మాజీ మంత్రి హరీశ్ రావు చేస్తున్న విమర్శలను తీవ్రంగా ఖండించారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 25 లక్షల మంది రైతులకు, ఒక్కొక్కరికి రూ. 2 లక్షల చొప్పున రుణమాఫీని విజయవంతంగా పూర్తి చేశామని ఆయన వివరించారు. సుమారు 40 బ్యాంకులు అందించిన డేటా ఆధారంగా అర్హులైన ప్రతి రైతుకూ ఈ ప్రయోజనం చేకూరేలా చర్యలు తీసుకున్నామని తుమ్మల క్లారిటీ ఇచ్చారు.
ఆర్థికంగా అనేక సవాళ్లు ఉన్నప్పటికీ రైతు సంక్షేమం కోసం తమ ప్రభుత్వం వెనకడుగు వేయలేదని మంత్రి గుర్తు చేశారు. గత ప్రభుత్వ హయాంలో రైతుబంధు నిధుల విడుదల కోసం రైతులు నెలల తరబడి వేచి చూడాల్సి వచ్చేదని, కానీ తమ ప్రభుత్వం కేవలం తొమ్మిది రోజుల వ్యవధిలోనే రూ. 9 వేల కోట్ల రైతు భరోసా నిధులను రైతుల ఖాతాల్లో జమ చేసి రికార్డు సృష్టించిందని తెలిపారు. రెండు పంటల కాలంలోనే రైతుల సంక్షేమం కోసం దాదాపు లక్ష కోట్ల రూపాయలు ఖర్చు చేసిన ఘనత తమకే దక్కుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రైతులకు ఈ స్థాయిలో మేలు చేస్తున్న ప్రభుత్వం దేశంలో ఎక్కడైనా ఉందేమో హరీశ్ రావు సమాధానం చెప్పాలని తుమ్మల సవాల్ విసిరారు. నిరాధారమైన ఆరోపణలతో రైతులను తప్పుదోవ పట్టించవద్దని ఆయన ప్రతిపక్ష నేతలకు హితవు పలికారు.