ప్రిన్స్ హ్యారీకి షాక్.. తను స్థాపించిన ఛారిటీ నుంచే పరువు నష్టం దావా!

బ్రిటన్ రాజకుటుంబానికి చెందిన ప్రిన్స్ హ్యారీకి ఊహించని పరిణామం ఎదురైంది. తన తల్లి దివంగత ప్రిన్సెస్ డయానా జ్ఞాపకార్థం ఆయన స్థాపించిన 'సెంటబాలే' అనే స్వచ్ఛంద సంస్థే ఇప్పుడు ఆయనపై పరువు నష్టం దావా వేసింది. సంస్థ ప్రతిష్ఠకు భంగం కలిగించారని ఆరోపిస్తూ లండన్ హైకోర్టులో కేసు దాఖలు చేసింది. ఈ కేసులో ప్రిన్స్ హ్యారీతో పాటు సంస్థ మాజీ ట్రస్టీ మార్క్ డయ్యర్‌ను కూడా ప్రతివాదిగా చేర్చారు.

సెంటబాలే ఛారిటీ తరఫున విడుదల చేసిన ఒక ప్రకటన ప్రకారం.. ప్రిన్స్ హ్యారీ, మార్క్ డయ్యర్ ఉద్దేశపూర్వకంగా సంస్థకు వ్యతిరేకంగా మీడియాలో ప్రచారం చేయించారని, దీనివల్ల సంస్థ ప్రతిష్ఠకు తీవ్ర నష్టం వాటిల్లిందని ఆరోపించింది. ఈ ప్రతికూల ప్రచారం కారణంగా సంస్థ కార్యకలాపాలకు ఆటంకం కలగడంతో పాటు తమ నాయకత్వం సైబర్ బుల్లీయింగ్‌కు గురైందని పేర్కొంది. మార్చి 24న ఈ పరువు నష్టం దావాను దాఖలు చేసినట్టు కోర్టు ఫైలింగ్స్‌లో వెల్లడైంది.

అయితే, ఈ ఆరోపణలను ప్రిన్స్ హ్యారీ, మార్క్ డయ్యర్ తీవ్రంగా ఖండించారు. వారి ప్రతినిధి మాట్లాడుతూ.. "సంస్థ సహ-వ్యవస్థాపకులుగా, ఈ నిరాధారమైన, అవమానకరమైన ఆరోపణలను పూర్తిగా ఖండిస్తున్నాం. దాదాపు రెండు దశాబ్దాలుగా సంస్థను నిర్మించి, మద్దతుగా నిలిచిన వారిపైనే కేసు పెట్టడానికి ఛారిటీ నిధులను ఉపయోగించడం దిగ్భ్రాంతికరం. ఆ నిధులను సేవా కార్యక్రమాలకు వినియోగించాల్సింది పోయి, ఇలా కేసులు పెట్టడం దారుణం" అని విమర్శించారు.

వివాదం నేపథ్యం ఇదే..!
ఆఫ్రికాలోని లెసోతో, బోట్స్వానా దేశాల్లో హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌తో బాధపడుతున్న యువతకు సహాయం అందించేందుకు ప్రిన్స్ హ్యారీ 2006లో ఈ ఛారిటీని ప్రారంభించారు. అయితే, గతేడాది సంస్థ ఛైర్‌పర్సన్ సోఫీ చండౌకాతో తీవ్రమైన పాలనాపరమైన విభేదాలు రావడంతో ఆయన సంస్థ నుంచి తప్పుకున్నారు. ఛైర్‌పర్సన్ వైదొలగాలని ట్రస్టీలు డిమాండ్ చేయగా, ఆమె నిరాకరించడంతో ప్రిన్స్ హ్యారీ సహా పలువురు ట్రస్టీలు రాజీనామా చేశారు. ఈ వివాదంపై గతేడాది ఆగస్టులో విచారణ జరిపిన యూకే ఛారిటీ కమిషన్, సంస్థలో నిర్వహణ లోపాలు ఉన్నాయని తేల్చింది. అయితే, ఛైర్‌పర్సన్ ఆరోపించినట్టుగా ఎలాంటి బెదిరింపులు, వేధింపులు జరగలేదని స్పష్టం చేసింది. ఈ వివాదం బహిరంగంగా రచ్చకెక్కడం వల్ల సంస్థ ప్రతిష్ఠ దెబ్బతిందని కమిషన్ అన్ని పక్షాలను తప్పుబట్టింది.

Prince Harry
Sentebale
Princess Diana
Charity lawsuit
Mark Dyer
Defamation
UK Charity Commission
HIV AIDS
Lesotho
Botswana

More Telugu News