లెబనాన్‌పై దాడుల ఎఫెక్ట్.. అమెరికాతో చర్చలకు ఇరాన్ బ్రేక్
- అమెరికాతో జరుపుతున్న చర్చలను ఇరాన్ నిలిపివేత
- లెబనాన్‌పై ఇజ్రాయెల్ సైనిక దాడులే ఇందుకు కారణం
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించారని ఇరాన్ ఆరోపణ
- పరిణామాలకు అమెరికా, ఇజ్రాయెల్ బాధ్యత వహించాలని హెచ్చరిక
- తమ నౌకాశ్రయాలపై దిగ్బంధనం కూడా ఉల్లంఘనేనని స్పష్టీకరణ
లెబనాన్‌లో ఇజ్రాయెల్ నేరాలు కొనసాగిస్తుండటమే తమ నిర్ణయానికి కారణమని ఇరాన్ స్పష్టం చేసింది. "కాల్పుల విరమణకు లెబనాన్‌పై దాడులు చేయకూడదన్నది కూడా ఒక ముఖ్యమైన ముందస్తు షరతు. కానీ లెబనాన్‌తో సహా అన్ని అంశాల్లోనూ ఈ ఒప్పందాన్ని ఉల్లంఘించారు. అందుకే మధ్యవర్తిత్వం ద్వారా జరుగుతున్న చర్చలను, సందేశాల మార్పిడిని ఇరాన్ చర్చల బృందం నిలిపివేస్తుంది" అని తస్నిమ్ నివేదిక పేర్కొంది.
ఈ పరిణామంపై అంతకుముందు ఇరాన్ విదేశాంగమంత్రి అబ్బాస్ అరాఘ్చీ, పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బఘేర్ ఘలీబాఫ్ తీవ్రంగా స్పందించారు. ఇజ్రాయెల్ దాడులకు తగిన పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. అమెరికాతో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం లెబనాన్‌తో సహా అన్ని ప్రాంతాలకు వర్తిస్తుందని, ఏ ఒక్కచోట ఉల్లంఘన జరిగినా, అది అన్నిచోట్లా జరిగినట్టేనని వ్యాఖ్యానించారు. దీని పరిణామాలకు అమెరికా, ఇజ్రాయెల్ బాధ్యత వహించాలని అరాఘ్చీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
అమెరికాతో చర్చల్లో దేశ ప్రతినిధిగా ఉన్న ఘలీబాఫ్ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇరాన్ నౌకాశ్రయాలపై అమెరికా దిగ్బంధనం విధించడం, లెబనాన్‌లో ఇజ్రాయెల్ దాడులు చేయడం ఒప్పందాన్ని ఉల్లంఘించడమేనని అన్నారు. ప్రతి చర్యకు మూల్యం చెల్లించుకోవాల్సిందేనని ఆయన హెచ్చరించారు.