బీఆర్ఎస్ ఆరోపణలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన పొంగులేటి.. తాటాకు చప్పుళ్లకు బెదిరేది లేదని వ్యాఖ్య
తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీపై నిప్పులు చెరిగారు. రాజకీయ విమర్శల విషయంలో మంత్రి పొంగులేటి మరింత ఘాటుగా స్పందిస్తూ, తమకు అంటిన బురదను అధికార పార్టీ నేతలకు అంటించాలని కొంతమంది ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ఎవరు ఎన్ని అవాకులు చవాకులు పేలినా, కారుకూతలు కూసినా ఈ ప్రభుత్వం పేదలకు అండగా నిలుస్తుందని, ప్రతిపక్షాల తాటాకు చప్పుళ్లకు తాము బెదిరే ప్రసక్తే లేదని హెచ్చరించారు. భవిష్యత్తులో కూడా ఇందిరమ్మ రాజ్యాన్ని ప్రజలు దీవించడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం చేగొమ్మలో నూతనంగా నిర్మించిన గోదాము ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, ధాన్యం సేకరించిన వారం రోజుల్లోనే రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నామని స్పష్టం చేశారు.
రైతు సంక్షేమమే ధ్యేయంగా రైతు భరోసా కింద ప్రతి ఎకరానికి రూ. 12,000 అందిస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో ధరణి పోర్టల్ వల్ల రైతులు ఎదుర్కొన్న ఇబ్బందులను తొలగించేందుకు దానిని బంగాళాఖాతంలో కలిపి, పారదర్శకమైన 'భూ భారతి' విధానాన్ని తీసుకొచ్చామని ఆయన పేర్కొన్నారు. దీని ద్వారా ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా మూడు లక్షల ఎనభై వేల మంది రైతులకు కొత్త పాస్ పుస్తకాలు పంపిణీ చేసినట్లు వెల్లడించారు.
సన్న వడ్లకు మద్దతు ధరతో పాటు అదనంగా ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తున్నామని, పండించిన సన్న బియ్యాన్ని ఇతర ప్రాంతాలకు తరలించకుండా రేషన్ ద్వారా రాష్ట్రంలోని పేదలకు అందిస్తున్నామని మంత్రి వివరించారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం కలెక్టర్ దురిశెట్టి అనుదీప్, సీపీ సునీల్ దత్ మరియు పలువురు కార్పొరేషన్ చైర్మన్లు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.