ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. రక్షణ శాఖ ఆధ్వర్యంలో నిర్మాణం

తెలంగాణలోని ఆదిలాబాద్‌లో విమానాశ్రయం ఏర్పాటుకు మార్గం సుగమమైంది. ఇక్కడ రక్షణ శాఖ ఆధ్వర్యంలో ఒక విమానాశ్రయాన్ని నిర్మించనున్నట్టు, అందులోనే పౌర విమాన సర్వీసుల కోసం ప్రత్యేకంగా ఒక ఎన్‌క్లేవ్ ఏర్పాటు చేయనున్నట్టు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రకటించారు. బుధవారం ఢిల్లీలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశం అనంతరం ఆయన ఈ వివరాలు వెల్లడించారు.

రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డితో పాటు రామ్మోహన్ నాయుడు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఆదిలాబాద్‌లో రక్షణ శాఖకు ఇప్పటికే 360 ఎకరాల విస్తీర్ణంలో ఎయిర్‌స్ట్రిప్ ఉందని, విమానాశ్రయ పూర్తిస్థాయి నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం మరో 450 ఎకరాల భూమిని సేకరించి ఇవ్వాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. ఎయిర్‌బస్ A320 వంటి పెద్ద విమానాలు దిగేందుకు వీలుగా ఈ ఎయిర్‌పోర్ట్‌ను అభివృద్ధి చేయనున్నారు.

ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లేందుకు ఏప్రిల్ 17న రక్షణ శాఖ, ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI), రాష్ట్ర ప్రభుత్వ అధికారుల బృందం క్షేత్రస్థాయిలో పర్యటించి అధ్యయనం చేస్తుందని మంత్రి వివరించారు. ఆ తర్వాత మాస్టర్‌ప్లాన్ సిద్ధం చేసి రక్షణ శాఖ ఆమోదం తీసుకుంటామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ పూర్తి చేసిన వెంటనే పనులు ప్రారంభించవచ్చని తెలిపారు.

ఈ విమానాశ్రయం ఏర్పాటుతో ఆదిలాబాద్ ప్రాంత ప్రజల చిరకాల ఆకాంక్ష నెరవేరుతుందని రామ్మోహన్ నాయుడు అన్నారు. దీనివల్ల స్థానిక ఆర్థిక వ్యవస్థ బలపడటమే కాకుండా, పర్యాటక రంగం కూడా అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆదిలాబాద్‌కు 300 కి.మీ దూరంలో హైదరాబాద్, 170 కి.మీ దూరంలో నాగ్‌పూర్ విమానాశ్రయాలు ఉన్నాయి.

ఇదే సమావేశంలో తెలంగాణలోని ఇతర విమానాశ్రయాల ప్రగతిని కూడా సమీక్షించారు. వరంగల్‌లోని మామన్నూర్ ఎయిర్‌పోర్ట్‌కు మూడు నెలల్లో శంకుస్థాపన చేస్తామని, పెద్దపల్లి ఎయిర్‌పోర్ట్‌కు ప్రతిపాదించిన స్థలంపై సానుకూల నివేదిక వచ్చిందని తెలిపారు. కొత్తగూడెంలో ప్రతిపాదించిన స్థలం అనువుగా లేనందున, ప్రత్యామ్నాయ స్థలాన్ని సూచించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరినట్టు మంత్రి వెల్లడించారు.

Kinjarapu Rammohan Naidu
Adilabad Airport
Telangana Airport
Defense Ministry
Airports Authority of India
Raj Nath Singh
G Kishan Reddy
Mamnoor Airport
Peddapalli Airport
Airbus A320

More Telugu News