ఏబీఎన్ ఛానెల్ పై ఎన్బీడీఏ, ఎన్సీడబ్ల్యూలకు వైసీపీ ఫిర్యాదు

ప్రముఖ తెలుగు మీడియా సంస్థ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, మహిళలను కించపరిచేలా, పరువు నష్టం కలిగించేలా కథనాలు ప్రసారం చేసిందంటూ వైసీపీ తీవ్ర ఆరోపణలు చేసింది. ఈ మేరకు ఆ సంస్థపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతూ న్యూస్ బ్రాడ్‌కాస్టర్స్ అండ్ డిజిటల్ అసోసియేషన్ (ఎన్బీడీఏ), జాతీయ మహిళా కమిషన్ (ఎన్సీడబ్ల్యూ)లకు వేర్వేరుగా ఫిర్యాదు చేసింది.

వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లెళ్ల అప్పిరెడ్డి ఎన్బీడీఏకి ఇచ్చిన ఫిర్యాదులో.. మాజీ ముఖ్యమంత్రి జగన్ ను, పార్టీని లక్ష్యంగా చేసుకుని ఏబీఎన్ ఛానెల్ దురుద్దేశపూర్వకంగా, నిరాధారమైన కంటెంట్‌ను ప్రసారం చేసిందని పేర్కొన్నారు. ఇది జర్నలిజం కాదని, ప్రజలను తప్పుదోవ పట్టించి, విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నమని ఆయన ఆరోపించారు. 

మరోవైపు, వైసీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వరుదు కల్యాణి, ఆ ఛానెల్ మహిళలను ఉద్దేశించి అవమానకరమైన వ్యాఖ్యలు చేసిందంటూ జాతీయ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. వైసీపీ మద్దతుదారులను "వెన్నెముక లేని వాళ్లు" అంటూ ఆ ఛానెల్ లో దూషించారని, మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా మాట్లాడారని ఇరువురు నేతలు తమ ఫిర్యాదుల్లో తెలిపారు.

ఈ క్రమంలో విలేకరుల సమావేశంలో మాట్లాడిన వరుదు కల్యాణి, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణను తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. అమరావతిలో జరుగుతున్న అవినీతి, జగన్ ప్రతిపాదించిన 'మావిగన్' (మచిలీపట్నం-విజయవాడ-గుంటూరు) మోడల్‌పై పెరుగుతున్న చర్చ నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే రాధాకృష్ణ ద్వారా ఈ వ్యాఖ్యలు చేయించారని ఆమె ఆరోపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ ఈ వ్యాఖ్యలను ఖండించకపోవడమే ఇందుకు నిదర్శనమని ఆమె విమర్శించారు.

జర్నలిజం నిబంధనలను ఉల్లంఘించి, కనీస సమాచారం లేకుండా ఏకపక్ష కథనాలు ప్రసారం చేశారని వైసీపీ ఆరోపించింది. సంబంధిత ఛానెల్, యాంకర్, ఎడిటర్, యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఆ కంటెంట్‌ను వెంటనే తొలగించి, బహిరంగ క్షమాపణ చెప్పాలని వైసీపీ డిమాండ్ చేసింది. మీడియా బాధ్యతాయుతంగా వ్యవహరించేలా చూడాలని కమిషన్లను కోరింది.

ABN Andhra Jyothi
YSRCP
Lella Appireddy
Varudu Kalyani
Radha Krishna
National Commission for Women
NCW
News Broadcasters and Digital Association
NBDA
Defamatory news

More Telugu News