దిగ్గజ క్రికెటర్ రవిశాస్త్రికి అరుదైన గౌరవం
భారత క్రికెట్ దిగ్గజం, టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రికి ముంబై క్రికెట్ అసోసియేషన్ (MCA) అరుదైన గౌరవాన్ని ప్రకటించింది. ముంబైలోని ఐకానిక్ వాంఖడే స్టేడియంలోని ఒక స్టాండ్‌కు ఆయన పేరు పెట్టాలని నిర్ణయించింది.
వాంఖడే స్టేడియంలోని ప్రెస్ బాక్స్ కింద ఉన్న లెవల్ 1 స్టాండ్‌కు 'రవిశాస్త్రి స్టాండ్' అని పేరు పెట్టనున్నారు. నాలుగు దశాబ్దాలుగా ఆటగాడిగా, కెప్టెన్‌గా, కోచ్‌గా, వ్యాఖ్యాతగా ఆయన అందించిన విశిష్ట సేవలకు గుర్తింపుగా ఎంసీఏ ఈ నిర్ణయం తీసుకుంది.
ఈ వేడుకలో రవిశాస్త్రితో పాటు ముంబైకి చెందిన మరికొందరు క్రికెట్ దిగ్గజాల పేర్లను స్టేడియం గేట్లకు పెట్టనున్నారు. మహిళా క్రికెట్ దిగ్గజం, మాజీ కెప్టెన్ డయానా ఎడుల్జీ పేరును గేట్ నంబర్ 5కు పెట్టనున్నారు. దివంగత బ్యాటింగ్ దిగ్గజం దిలీప్ సర్దేశాయ్ పేరును గేట్ నంబర్ 3కి కేటాయించారు. అద్భుతమైన ఫీల్డర్‌గా పేరుగాంచిన ఏకనాథ్ సోల్కర్ గౌరవార్థం గేట్ నంబర్ 6కు ఆయన పేరు పెట్టనున్నారు. రేపు నిర్వహించే ఈ భారీ ఆవిష్కరణ కార్యక్రమానికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్య అతిథిగా హాజరై... ఈ స్టాండ్, గేట్లను అధికారికంగా ప్రారంభిస్తారు. ఎంసీఏ అధ్యక్షుడు అజింక్య నాయక్ ఆధ్వర్యంలో ఈ వేడుక జరగనుంది.
రవిశాస్త్రి ముంబై తరఫున ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ఒకే ఓవర్‌లో 6 సిక్సర్లు కొట్టిన రికార్డుతో పాటు, 1983 ప్రపంచకప్ విజేత జట్టులో సభ్యుడిగా కూడా ఉన్నారు. తన కెరీర్‌లో 80 టెస్టులు, 150 వన్డేలు ఆడి దాదాపు 7 వేల పరుగులు, 280 వికెట్లు తీశాడు.