ఏబీఎన్-ఆంధ్రజ్యోతి కార్యాలయంపై వైసీపీ దాడిని ఖండించిన ఏపీ సీఎం చంద్రబాబు

హైదరాబాద్‌లో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయంపై వైసీపీ దాడి యత్నాన్ని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. అమరావతిపై వైసీపీ చీఫ్, మాజీ సీఎం జగన్ వైఖరిని ప్రశ్నించినందుకే ఈ దాడికి పాల్పడ్డారని విమర్శించారు. ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు స్వయంగా రౌడీ మూకలను వెంటేసుకుని మీడియా సంస్థలపై దాడులకు వెళ్లడం వైసీపీ విష సంస్కృతికి నిదర్శనమని మండిపడ్డారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయంపై వైసీపీ నేతలు, రౌడీలు దాడికి దిగడం మీడియా స్వేచ్ఛపై దాడిగా ముఖ్యమంత్రి చంద్రబాబు అభివర్ణించారు. సొంతంగా మీడియా సంస్థలను నడుపుతూ.. మీడియాను అడ్డుపెట్టుకుని అనైతిక చర్యలకు పాల్పడుతోన్న వైసీపీ.. తమను ప్రశ్నించిన ఆంధ్రజ్యోతిపై ఆరోపణలు, దూషణలు చేయడం అసంబద్ధమని విమర్శించారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో మీడియా సంస్థలపై ముఖ్యంగా ఆంధ్రజ్యోతిపై అనేక వేధింపులకు, కుట్రలకు పాల్పడిందని చంద్రబాబు చెప్పారు.

నాటి ప్రభుత్వ కుట్రలను, వేధింపులను తట్టుకుని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సహా ఇతర మీడియా సంస్థలు నిబ్బరంగా నిలిచాయి తప్ప భయపడలేదని గుర్తుచేశారు. దశాబ్దాలుగా కేసులకు, దాడులకు, ఒత్తిళ్లకు భయపడకుండా ఆంధ్రజ్యోతి మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణ పత్రికను, ఛానెల్‌ను నడుపుతున్నారన్నారు. దాడులు, నిరసనలు, బెదిరింపులతో మీడియాను భయపెట్టాలనే వైసీపీ రాజకీయాలకు కాలం చెల్లిందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. అధికారంలో ఉండగా మహిళల పట్ల, సొంత కుటుంబ సభ్యుల పట్ల వైసీపీ నాయకులు, ఆ పార్టీ అధ్యక్షుడు వ్యవహరించిన తీరును మహిళా సమాజం ఎప్పటికీ మర్చిపోదన్నారు. రాజధానిపై వైసీపీ కుట్రలను ప్రశ్నించిన ఆంధ్రజ్యోతి సంపాదకీయానికి సమాధానం చెప్పలేక దాడులు, నిరసనలతో వైసీపీ డైవర్షన్ పాలిటిక్స్‌కు పాల్పడుతోందని సీఎం చంద్రబాబు తీవ్రంగా విమర్శించారు.

Chandrababu Naidu
ABN Andhra Jyothi
YCP attack
media freedom
Amaravati
Jagan Mohan Reddy
Andhra Pradesh politics
Vemuri Radhakrishna
media harassment
political criticism

More Telugu News